నిర్మల్ జిల్లా(nirmal district) బాసర ట్రిపుల్ ఐటీ(Basara iiit)లో మరో విషాదం చోటుచేసుకుంది. జూన్ 14న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో విద్యార్థి మృతి చెందింది. లిఖిత అనే విద్యార్థిని అర్థరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కింద పడి లిఖిత బలవన్మరణం చేసుకుంది. ఈ ఘటన రాత్రి 2 గంటల ప్రాంతంలో జరగడం గమనార్హం. అయితే లిఖిత కిందపడిపోయిందని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది…ఆమెను క్యాంపస్ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే లఖిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
లిఖిత హాస్టల్లోని నాలుగో అంతస్తు(fourth floor) నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే ఆమె ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి చనిపోయిందని యాజమాన్యం, క్యాంపస్ సిబ్బంది చెబుతున్నారు. ఆమె స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్. ఈ ఘటనపై పోలీసులు(police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదమా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ పడిఉంటే నాలుగో అంతస్తుకు ఎందుకు వెళ్లింది? లిఖిత మృతితో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.