తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై దృష్టి సారించారు. ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాల్లో తన మార్క్ చూపించాలని ఆయన అనుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలోనే ఆ దిశగా ఆయన తన పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఆయన ఈరోజు బిహార్ పర్యటనకు వెళ్లారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు ఆయన ఈ పర్యటనకు వెళ్లడం గమనార్హం. బుధవారం ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
గతంలో ప్రకటించిన మేరకు, గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బిహార్ కు చెందిన ఐదుగురు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు కేసీఆర్. సైనిక కుటుంబాలతో పాటు, ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థికసాయం ఇవ్వనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత నితీష్ ఆహ్వానం మేరకు మధ్యాహ్న భోజనం చేస్తారు.
కేసీఆర్ బిహార్ పర్యటనపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. సొంత ప్రయోజనాల కోసమే డబ్బుల పంపిణీ చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. ఎంతోమంది బాధితులు ఎన్నారని వారిని ఏనాడూ కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వారికి సాయం చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు ఉన్నాయని.. ముందు తెలంగాణలో ఉన్న బాధితులకు న్యాయం చేయండని చెబుతున్నాయి.