ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) లీగల్ నోటీసులు పంపింది. ORR లీజుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లీజు వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బేషరతుగా 48 గంటల్లో మీడియా సమయక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని HMDA లీగల్ నోటీసులు జారీ చేసింది. ఓఆర్ఆర్ టెండర్ల వివాదం రోజురోజుకు ముదురుతోంది. తప్పుడు ఆరోపణలు చేశారంటూ…పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది హెచ్ఎండీఏ. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా..రేవంత్ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయ పడింది. నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూనే ఓఆర్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ బిడ్లకు సంబంధించిన పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్లో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని హెచ్ఎండీఏ తెలిపింది.
రాజకీయాల కోసం మీడియా ముందు రేవంత్ రెడ్డి చేసిన అసత్య ఆరోపణల వల్ల..సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందని HMDA ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు అందుకున్న ఆయన..48 గంటల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డిని హెచ్ఎండీఏ డిమాండ్ చేసింది. లేదంటే, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే హెచ్ఎండీఏ పంపిన లీగల్ నోటీసులపై కోర్టులోనే రేవంత్ తేల్చుకుంటానన్నారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ORR టెండర్ల విషయంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపించారు. RB సంస్థకు ఇచ్చిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం 30 రోజుల్లో 25 శాతం నిధులు చెల్లించారా అని ఆయన ప్రశ్నించారు.