ఇండోనేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 44 మంది దుర్మరణం చెందగా మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 5.6గా గుర్తించారు. భూకంపం కారణంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం సంభవించే సమయంలో జనాలు పరుగులు తీశారు. కొన్ని ఇళ్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు కుంగిపోయాయి.
అధికార యంత్రాంగం రంగంలో దిగింది. సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రజలెవరూ అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
భూకంప ధాటికి జావా ద్వీపం వణికిపోయింది. భూకంప కేంద్రం వెస్ట్ జావా లోని సియాంజూర్ సమీపంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూకంప ఫలితంగా అనేక చోట్ల భవనాలు, ఇతర కట్టడాలు దెబ్బ తిన్నాయి. రాజధాని జకార్తాలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. కూలిపోయిన శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నామని, దాదాపు 300 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారవర్గాలు వెల్లడించాయి.
వీరిలో చాలామందికి ఫ్రాక్చర్ గాయాలైనట్టు సియాంజూర్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ హెర్మన్ సుహేర్మన్ చెప్పారు. ఈ నగరంలో నాలుగు ఆసుపత్రులు ఉన్నాయని, ఇవన్నీ వీరితో నిండిపోయాయయని తెలిపారు.
మృతులు లేదా క్షతగాత్రుల సంఖ్య పెరగవచ్చునని ఆయన అన్నారు. జకార్తాకు 75 కి.మీ. దూరంలో ఉంది ఈ నగరం. ఈ సిటీలోని కొన్ని బిల్డింగులు దాదాపు పూర్తిగా నేలమట్టమైనట్టు మెట్రో టీవీ ఫుటేజీ చూపుతోంది. రెండు గంటల్లో 25 ప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది.