»Telangana Once Again Kcr Will Contest In Gajwel Says Minister Harish Rao
మంత్రి Harish Raoకు షాక్.. వద్దు వద్దు అంటూ కార్యకర్తల వినతి
కేసీఆర్ ను పంపిద్దామా? వద్దా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనికి కార్యకర్తలు ముక్తకంఠంతో ‘వద్దు.. వద్దు’ అని నినాదాలు చేశారు. ‘మళ్లీ మీకు కేసీఆర్ కావాలా? ’ అని హరీశ్ ప్రశ్నించగా.. ‘కావాలి.. కావాలి’ అంటూ కార్యకర్తలు కోరారు.
ఉమ్మడి జిల్లాలో రెండు నియోజకవర్గాలు.. పక్కపక్కనే ఉంటాయి. గంటలో ఇరు ప్రాంతాలకు రాకపోకలు సాగించవచ్చు. ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. కానీ ఒక్కరే ఆ రెండు నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ రెండు జోడెద్దుల్లా అభివృద్ధి పథంలో పరిగెడుతున్నాయి. ఆ నియోజకవర్గాలే సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ (Gajwel), సిద్ధిపేట (Siddipet). గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, సిద్ధిపేట నుంచి హరీశ్ రావు (Harish Rao) గెలుపొందారు. అయితే పేరుకే కేసీఆర్ ఎమ్మెల్యే కానీ గజ్వేల్ లో అన్నీ వ్యవహారాలు చూసుకునేది మంత్రి హరీశ్ రావే. అలాంటి హరీశ్ రావుకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు అతడి అభిమానులు కూడా హరీశ్ రావు కు షాకిచ్చారు. హరీశ్ అడిగిన ప్రశ్నలకు కార్యకర్తలు భిన్నమైన స్పందన ఇచ్చారు. ట్రబుల్ షూటర్ కే ఇచ్చిన షాక్ ఏమిటో తెలుసుకోండి.
గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచినా ముఖ్యమంత్రి కావడంతో కేసీఆర్ (K Chandrashekar Rao) రాష్ట్ర వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది. గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలు మంత్రి హరీశ్ రావు చూసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విషయమై కార్యకర్తలను ప్రశ్నించారు. ‘అభివృద్ధిలో గజ్వేల్ నియోజకవర్గం దేశానికే నమూనాగా మారింది. అందుకే తమ జిల్లాల్లో కేసీఆర్ పోటీ చేయాలని రాష్ట్రమంతటా అడుగుతున్నారు. మరి కేసీఆర్ ను పంపిద్దామా? వద్దా?’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనికి కార్యకర్తలు ముక్తకంఠంతో ‘వద్దు.. వద్దు’ అని నినాదాలు చేశారు. ‘మళ్లీ మీకు కేసీఆర్ కావాలా? ’ అని హరీశ్ ప్రశ్నించగా.. ‘కావాలి.. కావాలి’ అంటూ కార్యకర్తలు కోరారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ (KCR) ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు. మూడోసారి కూడా కేసీఆర్ గజ్వేల్ నుంచి కేసీఆర్ బరిలోకి దిగాలని కోరుతూ కార్యకర్తలంతా చేతులెత్తారు. ‘ఈసారి కూడా గజ్వేల్ నుంచే పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని మీ మాటగా కేసీఆర్ కు చెబుతా’ అని హరీశ్ రావు తెలిపారు. దీంతో అక్కడ చప్పట్ల మోత మోగింది.