»Adulterated Toddy Adulterated Toddy Cases Increasing In Mahabubnagar District
Adulterated Toddy కల్తీ కల్లు కల్లోలం.. పెరుగుతున్న బాధితులు
కొన్ని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మత్తు పదార్థాల కొరత ఉంది. దీంతో మత్తు పదార్థాలను తక్కువ మోతాదులో కల్లులో కలుపుతున్నారు.
కల్తీ కల్లు ఈ మాట వింటే తెలంగాణలో విషాద సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్నేళ్ల కింద కల్తీ కల్లు మరణ మృదంగం సృష్టిస్తోంది. మళ్లీ ఆ భయానక రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐదు రోజుల వ్యవధిలో దాదాపు 50 మందికి పైగా బాధితులు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ కేసులు వెలుగులోకి రావడంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు రోజులుగా 4 రోజులుగా కల్తీ కల్లు తాగి ఆస్పత్రులు పాలవుతున్నారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు మొత్తం 33 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురు ఐసీయూలో చికిత్స పొందుతూ కదల్లేని స్థితిలో ఉన్నారని సమాచారం. 21 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ కాగా.. 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కల్తీ కల్లు బాధితులంతా మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి, నవాబుపేటకు చెందిన వారు ఉన్నారు.
కళ్లు తిరగడం, నోరు వంకరపోవడం, మెడ, గొంతు నొప్పి వంటి బాధతో వారంతా ఆస్పత్రిలో చేరారు. అందరికీ ఒకే లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఆరా తీశారు. వారంతా కల్లు తాగేవారని గుర్తించారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి బాధితులు ఆహారం తీసుకోవడం లేదు. ‘వింత చేష్టలతో ఆస్పత్రికి వస్తున్న బాధితులకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం’ అని మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాంకిషన్ తెలిపారు.
కల్తీ కల్లు అంటే..
ఉమ్మడి జిల్లాలో చెట్టు కల్లు కన్నా మందు కల్లు అధికంగా విక్రయం జరుగుతోంది. కల్లు కాంపౌండ్లలో ఇదే కల్లు లభిస్తోంది. కొన్ని కల్లు కాంపౌండ్లలో మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ మత్తు పదార్థాల కొరత ఉంది. దీంతో మత్తు పదార్థాలను తక్కువ మోతాదులో కల్లులో కలుపుతున్నారు. దీని ప్రభావంతో కల్లులో మత్తు తగ్గింది. ఇన్నాళ్లు మత్తకు అలవాటుపడిన వారు ఇప్పుడు మత్తు రాకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు.