ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు సహాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఇప్పటం బాధితులకు ఆర్దిక సాయం ప్రకటించారు. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో కొందరిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిందని పవన్ ఆరోపించారు. నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఇళ్లు కోల్పోయిన వారికి లక్ష రూపాయలు సాయం ప్రకటించారని తెలిపారు. తన వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని తమ అధినేత నిర్ణయించారని పార్టీ నేత మనోహర్ వెల్లడించారు. జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు.
జెసీబీలను పెట్టి, పోలీసులను మోహరింప చేసి అరెస్టు చేయించారన్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని ఆయన తెలిపారు. ఘటన జరిగిన మరునాడే పవన్ కళ్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులను పరామర్శించారన్నారు.
ఇళ్ళు దెబ్బతిన్నా ధైర్యం కోల్పోని ఇప్పటంవాసుల గుండె నిబ్బరాన్ని చూసి చలించిపోయారని… బాధితులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారని అన్నారు. నైతిక మద్దతుతో పాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలని లక్ష రూపాయల వంతున భరోసాను ఇప్పుడు ప్రకటించినట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అందచేస్తారని నాదెండ్ల మనోహర వెల్లడించారు.