నాని ప్రస్తుతం ఒక హీరోగానే కాదు, అటు నిర్మాతగా కూడా హిట్స్ మీద హిట్స్ కొడుతున్న హీరో. ఈమధ్యలో వచ్చిన కోర్టు, తర్వాత వచ్చిన హిట్ 3 రెండింటికీ రెండూ దుమ్ము లేపేశాయి. ఇటు డబ్బు, లాభాలు, అటు బ్రహ్మాండమైన ఇమేజ్ ఆటోమేటిక్‌గా కొట్టేశాడు నాని. తీస్తే నానిలా తీయాలి, కొడితే నానిలా కొట్టాలి, కథని జడ్జ్ చేయాలంటే నానిలా చెయ్యాలి అనే పెద్ద టాక్ అన్నిచోట్లా నడుస్తోంది ఇండస్ట్రీలో.
ఎందరో గాలం వేసి నాని డేట్స్ కొట్టేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే దీనికి బలమైన కారణం ఉంది. నాని ఏ కథనీ అంత ఈజీగా ఒప్పుకోడు. తన కథలు వేరు. తన దర్శకులు వేరు. మొత్తానికి నాని పంథాయే వేరే. రెగ్యులర్ కథల్ని, రొటీన్ డైరెక్టర్లతో నాని చేయడానికి సిద్ధపడడు అనేది నాని సినిమాల వరస చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. కొత్తవాళ్ళనే ఎక్కువగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి ఫ్యూచర్‌ని ఇస్తున్నాడు. తనూ తన కెరీర్ స్కోర్‌ని స్టెప్ బై స్పెప్ పెంచుకుంటున్నాడు. పరిశ్రమలో గొప్ప ఉదాహరణగా పేరు తెచ్చుకున్నాడు నాని. అందుకే నానికి ఎవరితోనూ పొంతన దొరకదు.
ఇలాటి నానితో శేఖర్ కమ్ముల చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. శేఖర్ కమ్ముల కూడా ఏం తక్కువ కాదు. ఆయనో విచిత్రమైన దర్శకుడు. తాను అనుకున్న కథ ముందు తనకే నచ్చాలి. తను బాగా ఎంజాయ్ చేయగలగాలి. ఆ తర్వాత ఇది ఎవరు చేస్తే బాగుంటుందనే ఆలోచన తనకే ముందు రావాలి. ఎవరో చెబితే శేఖర్‌కి నచ్చదు. ఫరవాలేదు. అదో మూడ్నాలుగా సంవత్సరాలు అయినా పర్వాలేదు. ఆయనకేం తొందరుండదు. గాభర పడడు. డబ్బుకి కక్కుర్తి పడే రకంకాదు. ఇన్ని దుర్వ్యసనాలున్న దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో శేఖర్ ఒక్కడే. మరిలాంటి డైరెక్టర్ నానితో సినిమా అంటే ఉరుకులపరుగులతో, రొప్పుతూ పరిగెత్తడు కదా. మరీ సినిమా ఎలా వస్తుంది. ఏమో. ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. పైగా ఇప్పుడే తాజాగా కుబేరలాంటి పెద్ద హిట్‌ని సొంతం చేసుకున్న తర్వాత ఆ సక్సెస్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్న మూడ్‌లో ఉన్నాడు శేఖర్. ఈ హేంగోవర్ నుంచి బైటకొచ్చి, ఆయనకేదైనా విచిత్రమైన థాట్ వచ్చి, అది మళ్ళీ కథగా తయరై…. అబ్బబ్బో మామ్మూలు యవ్వారం కాదు.
నాని అయితే రెడీగానే ఉన్నాడు శేఖర్‌తో చెయ్యాడానికి. వాళ్ళ కాంబినేషన్లో చెయ్యడానికి ముచ్చటపడి, నానిని, శేఖర్ని అప్రోచ్ అవుతున్నది కూడా సాదాసీదా నిర్మాతలు కాదు. కుబేరలాంటి భారీ ఎత్తు విజయాన్ని నిర్మించిన గండరగండలు ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్ అండ్ వేంకటేశ్వర సినిమాస్ పుస్కూర్ రామ్మోహనరావు. అవుతుంది ఈ సినిమా. కానీ…నాని, శేఖర్ కమ్ముల ఎప్పుడు రెడీ అవుతారో దేవుడు కూడా చెప్పలేడు.