భద్రాచలంలోని (Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి (sri seetha ramachandra swamy) వారికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం (sri rama pattabhishekam) వైభవంగా నిర్వహించారు. మొదట ప్రధాన ఆలయంలో స్వామి వారిని కల్పవృక్ష వాహనం పైన ఊరేగించారు. ఆ తర్వాత సామూహిక పారాయణం, హోమం చేశారు. శ్రీరాముల వారిని మిథిలా మండపానికి (Mithila Mandapam) చేర్చారు. పట్టాభిషేక మహోత్సవం గురించి పండితులు ప్రవచనం చేశారు. దేశంలో నలువైపుల ఉన్న పుణ్య నదుల నుండి వైదిక సిబ్బంది సేకరించిన పుష్కర తీర్థాలను పట్టాభిషేకానికి తీసుకు వచ్చారు. మొదట మిథిలా మండపం వద్ద ఉంచి వాటికి ఆవాహన పూజ చేశారు. ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆద్యంతం జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రతి పుష్కరానికి అంటే పన్నెండేళ్లకు ఒకసారి శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. అలాగే అరవై ఏళ్లకు ప్రభవనామ సంవత్సరంలో శ్రీరామ మహా సామ్రాజ్య వైభవ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుష్కర పట్టాభిషేకం 1999లో, 2011లో, ఇప్పుడు మరోసారి నిర్వహించారు.
శ్రీరాముల వారి పట్టాభిషేకాన్ని తిలకించేందుకు గవర్నర్ ((Telangana Governor) తమిళసై సౌందరరాజన్ ((Tamilisai Soundararajan) భద్రాచలంకు వచ్చారు. గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న గవర్నర్ మణుగూరు రైలులో నేడు వేకువజాము సమయానికి భద్రాచలం క్రాస్ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో భద్రాచలం వచ్చారు. స్వామివారి పట్టాభిషేకంలో తరించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
గవర్నర్ ఉదయం ప్రధాన ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రమాదేవి స్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. సమీపంలోని ఆంజనేయ స్వామి, లక్ష్మీతాయారమ్మలను దర్శించుకున్నారు. ఆ తర్వాత పట్టాభిషేకం నిర్వహించిన మిథిల మండపానికి చేరుకున్నారు. ఈ వేడుకల్లో కలెక్టర్ అనుదీప్, గిరిజన శాఖమాత్యులు సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. పట్టాభిషేకం అనంతరం గవర్నర్ ట్వీట్ చేశారు. తెలంగాణాలోని చారిత్రక శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం, భద్రాచలం, లో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వీక్షించడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని, తెలంగాణ, భారత ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించానని చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మిథిల ప్రాంగణం నిండిపోయింది.