»Earthquake Effect Of Vijay Leo Movie Shooting Fans Are Worried At Kashmir
Leo: విజయ్ లియో చిత్రానికి భూకంపం ఎఫెక్ట్..ఆందోళనలో ఫ్యాన్స్!
తమిళ్ స్టార్ హీరో దలపతి విజయ్(Vijay) నటిస్తున్న 'లియో(LEO)' చిత్రానికి భూకంపం(Earthquake) ప్రభావం కనిపించింది. లియో చిత్రానికి కో రైటర్ గా ఉన్న రత్న కుమార్ ఈ మేరకు మంగళవారం రాత్రి బ్లడీ ఎర్త్ క్వేక్ అంటూ ట్వీట్ చేశారు. కానీ తర్వాత అందరూ సురక్షితంగా ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది.
మార్చి 21న రాత్రి 11 గంటలకు కశ్మీర్, పాకిస్తాన్, ఆప్గానిస్తాన్ సహా పలు ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఇది ఆయా ప్రాంతాల్లోని ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ప్రకంపనలు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం వరకు చేరినట్లు తెలిసింది. 45 సెకన్ల నుంచి ఒకటిన్నర నిమిషాలపాటు భూకంపం కంపించింది. ఈ క్రమంలో తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆప్గానిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ ప్రాంతాల్లో కూడా భారీ కుదుపులను వచ్చాయని అక్కడి మీడియా తెలిపింది. అయితే ఈ ప్రకంపనల నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది.
మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దలపతి విజయ్(Vijay)నటిస్తున్న ‘లియో(LEO)’ చిత్రం ఫిబ్రవరి ప్రారంభం నుంచి కశ్మీర్లో షూటింగ్ జరుగుతోంది. మార్చి 25 వరకు కొనసాగనున్న ఈ షూటింగ్ కు భూకంపం ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. సినిమా తారాగణం, సిబ్బంది కూడా ప్రకంపనలను అనుభవించారని వెలుగులోకి వచ్చింది. మొదట భారీ గాలులు వచ్చాయని, తర్వాత అది భూకంపమని గ్రహించారని తెలిసింది.
ఈ విషయాన్ని చిత్ర రచయిత రత్నకుమార్ తెలిపారు. ట్విట్టర్(twitter) వేదికగా “బ్లడీ ఎర్త్‌క్వేక్” అని పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బృందం సురక్షితంగా ఉందని అభిమానులకు హామీ ఇచ్చింది. వడివేలు ‘చంద్రముఖి’ సినిమాలో భయంతో వణుకుతున్నట్లు ఓ మీమ్ వీడియోను పోస్ట్ చేసి ప్రకటించింది. ప్రస్తుత షెడ్యూల్లో తలపతి విజయ్, త్రిష ఉన్నారు. వారు సురక్షితంగా ఉన్నారని సినీ వర్గాలు తెలిపాయి. చాలా మంది తారాగణం, సిబ్బంది భయపడ్డారని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ ఇప్పుడు అంతా ఓకే అని ప్రకటించారు. ఆ ప్రభావంతో హోటల్ భవనం కదిలిన తర్వాత వారిలో ఎక్కువ మంది గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ ఏరియాకు చేరుకున్నారని, మరికొందరు హోటల్ బయటికి కూడా వెళ్లారని నివేదికలు చెబుతున్నాయి.