తమ పార్టీలో ఏం జరుగుతుందో తమకు తెలీదని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) పేర్కొన్నారు. తమ పార్టీ చీఫ్ సోము వీర్రాజు పై కన్నా లక్ష్మీ నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ తో తమకు సరైన కమ్యూనికేషన్ లేదని.. అలా లేకపోవడం తమ పార్టీ వైఫల్యమేనని ఆయన చెప్పారు.
పార్టీలో వ్యవహారాలన్నీ సోము వీర్రాజు ఒక్కడే చూడాలనుకోవడంతోనే ఈ సమస్య వచ్చిందని అభిప్రాయపడ్డారు. మా పార్టీలో ఏం జరుగుతుందో మాకు పెద్దగా తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో బిజెపి బలోపేతానికి జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
అదే విధంగా జగన్ పాలనపై కూడా పలు విమర్శలు చేశారు. ఏపీ లో నియంత పాలన సాగుతుందని, ఈ రాష్ట్రంలో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని అన్నారు. రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలు చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో పొత్తులు ఉంటాయా ఉండవా అన్న విషయం తాను చెప్పలేనని, అది బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు ఏపీ ఇన్చార్జ్ సునీల్ ధియోధర్ సీఎం జగన్ను హిందూ వ్యతిరేకిగా అభివర్ణించారు. రెండు రోజుల క్రితం బాపట్ల జిల్లాలోని కనపర్తి గ్రామంలో నందీశ్వరుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై పలు విమర్శలు చేశారు. ప్రపంచంలో ఉన్న హిందువులంతా భక్తి భావంతో పూజించే పరమశివుడికే ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని సార్లు హిందు దేవాలయాల్లో విగ్రహాలపై దాడులు జరిగినా ఒక్కడిని కూడా పట్టుకోలేకపోయారని విమర్శించారు.