»Probe Adani Scam 16 Opposition Mps March From Parliament To Ed Office
Adani Scam ఢిల్లీలో 16 పార్టీల కవాతు.. ఎక్కడికక్కడ అరెస్ట్
సమావేశాలు పున:ప్రారంభం అయిన తర్వాత సభలో అదానీపై చర్యలకు పట్టుబట్టగా ఫలితం లభించలేదు. వీరి ఆందోళనతో సోమ, మంగళ, బుధవారాల్లో సభలు వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో ప్రతిపక్షాలు రోడ్డునకెక్కాయి.
పార్లమెంట్ సమావేశాల్లో (Parliament Session) గౌతమ్ అదానీ (Gautam Adani Scam) కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నుంచి అదానీ కుంభకోణం (Gautam Adani Scam)పై విచారణ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు (Oppositon Parties) డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై సభ లోపల, బయట ఆందోళనలు (Protest) చేపడుతున్నాయి. అయితే ప్రతిపక్షాల డిమాండ్ ను నరేంద్ర మోదీ (Modi) ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. కనీసం సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని వాయిదా తీర్మానాలు ఇస్తున్నా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla), రాజ్యసభ చైర్మన్ ధన్ కర్ పక్కకు తోసేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్ష పోరాటానికి దిగాయి. లక్షల కోట్ల కుంభకోణంపై దర్యాప్తు చేయాలని, జేపీసీ (JPC) వేయాలని కోరుతూ బుధవారం 16 ప్రతిపక్ష పార్టీలు ఈడీ కార్యాలయానికి కవాత్తు చేపట్టాయి. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి, సీబీఐ కేంద్ర కార్యాలయానికి ఊరేగింపుగా బయల్దేరారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లో ఉండడంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
కాగా ఈ ఆందోళన కార్యక్రమంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) పాల్గొనకపోవడం గమనార్హం. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ)తో పాటు కాంగ్రెస్ తో సహా డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, జనతా దళ్, ఆప్, సీపీఐ, సీపీఐ(ఎం), శివసేన (ఉద్దవ్ వర్గం), ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీ తదితర పార్టీల ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సమావేశాలు పున:ప్రారంభం అయిన తర్వాత సభలో అదానీపై చర్యలకు పట్టుబట్టగా ఫలితం లభించలేదు. వీరి ఆందోళనతో సోమ, మంగళ, బుధవారాల్లో సభలు వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో ప్రతిపక్షాలు రోడ్డునకెక్కాయి.
జనవరి 24వ తేదీన అదానీ వ్యాపార సంస్థలపై హిండెన్ బర్గ్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేసేలా అదానీ కంపెనీ మోసాలకు పాల్పడిందని హిండెక్ సంస్థ నివేదిక ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా భారతదేశంలో తీవ్ర దుమారం రేపింది. భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అదానీ సంస్థ షేర్లు ఢమాలయ్యాయి. దాదాపు పది లక్షల కోట్లకు పైగా అదానీ కంపెనీ సంపద ఆవిరైంది. దీని దెబ్బకు గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 20లోకి దిగజారాడు.