Arvind Dharmapuri: కవిత దేశం ముందు తలదించేలా చేస్తున్నారు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత ఇది కుట్రపూరితమని, బీజేపీ కావాలని టార్గెట్ చేస్తోందని, కానీ 'తెలంగాణ తలవంచదు' ట్వీట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam) భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు (ED notice) ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత ఇది కుట్రపూరితమని, బీజేపీ కావాలని టార్గెట్ చేస్తోందని, కానీ ‘తెలంగాణ తలవంచదు’ ట్వీట్ చేశారు. దీనిపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో (KCR Government) 2014-2018 వరకు ఒక్క మహిళ కూడా మంత్రిగా లేరని గుర్తు చేశారు. అప్పుడు నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న కవిత పార్టీలో ఆధిపత్యానికి స్పష్టమైన కారణాల వల్ల మహిళలకు కేబినెట్లో అవకాశం లేదని ఆరోపించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి, ఆ తర్వాత నెపోటిజం కోటాలో కవిత ఎమ్మెల్సీ అయ్యారన్నారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక కుట్రదారుగా రూపుదిద్దుకున్న తర్వాత, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాలని ఆమె హఠాత్తుగా భావించడం.. ప్రజల దృష్టిని మరల్చేందుకేనని, ఆమె చేసిన వ్యర్థ ప్రయత్నం మాత్రమే అన్నారు. తెలంగాణ.. మొదటి లేదా ఇటీవలి ఉద్యమంలో ఎవరికీ తలవంచలేదు, కానీ ఇప్పుడు మీ ప్రమేయం చూసి దేశం ముందు సిగ్గుతో తెలంగాణ తలవంచుతోందని చురకలు అంటించారు.
తనకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ‘తెలంగాణ తల వంచదు’ అంటూ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత జాగృతి ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందన్నారు.
రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు. కానీ, ధర్నా, ముందస్తు అపాయింట్ మెంట్స్ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని తెలుసుకోవాలని మండిపడ్డారు కవిత. కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. దేశ అభ్యున్నతి కోసం నిరంతరం గొంతెత్తుతూనే ఉంటామని చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు కవిత. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని.. ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నానని స్పష్టం చేశారు. అయితే ఆమె వ్యాఖ్యలపై ధర్మపురి అరవింద్ భగ్గుమన్నారు.