మునుగోడు ఎన్నికల హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు.ఈ క్రమంలో… బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు.
మునుగోడు ఉప ఎన్నిక.. అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలానికి, స్థానిక ప్రజా బలానికి మధ్య జరుగుతున్న పోటీ అని కేటీఆర్ విమర్శించారు. కాంట్రాక్టుల కోసమే మునుగోడు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
ఈ నాలుగేండ్లలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న కేటీఆర్.. ఆయన ఒక ప్లాఫ్ ఎమ్మెల్యే అని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్దిని ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తన కాంట్రాక్టుల గురించి మాత్రమే ఆలోచించే ఫక్తు రాజకీయ వ్యాపారి రాజగోపాల్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఒక కాంట్రాక్టర్ బలుపు కారణంగానే వచ్చిందని మండిపడ్డారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఆయనను లోబర్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అవసరమైతే రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానని నరేంద్ర మోదీ అహకారం ప్రదర్శించారని మండిపడ్డారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి రూ. 18 వేల కోట్లు ఇస్తే.. పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు కేటీఆర్.