»Nia Raids At A Time In 72 Locations For Gangsters
NIA Raids: 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు.. గ్యాంగ్ స్టర్లు పరుగో పరుగు
నేర చరిత్ర ఉన్నవారితో పాటు అనుమానితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ లో ఎన్ఐఏ 5 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో కూడా ఇదే రీతిన దాడులు చేపట్టింది. నాడు లభించిన ఆధారాల ఆధారంగా తాజా దాడులు జరిగాయి.
కేంద్రం ప్రభుత్వం గ్యాంగ్ స్టర్ల భరతం పట్టేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. గతంలోనే విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టగా.. తాజాగా మరోసారి దాడులు ముమ్మరం చేయించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాంగ్ స్టర్లు రెచ్చిపోతున్నారు. దాడులు, దందాలు, సెటిల్ మెంట్లతో పాటు దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొందరి అండతో గ్యాంగ్ స్టర్లు యథేచ్చగా ప్రజల మధ్య తిరుగుతున్నారు. అలాంటి వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) (National Investigation Agency) ఉక్కుపాదం మోపింది. ఒకేసారి పెద్ద స్థాయిలో తనిఖీలు చేపట్టింది. దేశంలోని దాదాపు 8 రాష్ట్రాలు ఒక్కసారిగా దాడులు జరిగాయి. దీంతో గ్యాంగ్ స్టర్లు ఉరుకులు పరుగులు పెట్టారు. అచ్చం సినిమా మాదిరి సన్నివేశాలు జరిగాయి.
ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు వారికి సహకరించడం, మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న గ్యాంగ్ స్టర్లపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో మంగళవారం తెల్లవారుజామున ఎన్ఐఏ అధికారులు దాడులు జరిపారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-నోయిడా, చండీఘడ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టారు. దాదాపు 70 నుంచి వంద ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలోని ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో మాఫియా కార్యకలాపాలు బాగా పెరగడంతో అక్కడి గ్యాంగ్ స్టర్లపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పంజాబ్ లోని 30 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ లో ఆయుధాలు సరఫరా చేసే వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. అతడు పాకిస్థాన్ సహాయంతో ఆయుధాలు సరఫరా చేస్తున్నాడు.
దాడుల సమయంలో పదుల సంఖ్యలో లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ భవన గ్యాంగ్ స్టర్ల అనుచరులను విచారించారు. వారి నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక పాకిస్థాన్ ఐఎస్ఐ, గ్యాంగ్ స్టర్ నెక్సస్ ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ బృందాలు తనిఖీలు చేశాయి. ఇక నేర చరిత్ర ఉన్నవారితో పాటు అనుమానితులను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ లో ఎన్ఐఏ 5 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో కూడా ఇదే రీతిన దాడులు చేపట్టింది. నాడు లభించిన ఆధారాల ఆధారంగా తాజా దాడులు జరిగాయి.
Gujarat: NIA conducts raids at premises of gangster Lawrence Bishnoi's close aid in Gandhidham