»Renowned Film Editor Gg Krishna Rao Passes Away In Bengaluru
Cine Industryలో మరో విషాదం.. శంకరాభరణం ఎడిటర్ కన్నుమూత
ఒక్క తెలుగు సినిమానే కాదు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా కృష్ణారావు పని చేశారు. తెలుగులో దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కె. విశ్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, బాపు, జంధ్యాల వంటి వారి సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పని చేశారు.
తెలుగు సినీ పరిశ్రమ (Cine Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2023 ప్రారంభంలోనే దిగ్గజాలను పరిశ్రమ కోల్పోయింది. కొన్ని రోజుల వ్యవధిలోనే కళాతపస్వి కె.విశ్వనాథ్, నటుడు నందమూరి తారకరత్నను కోల్పోయి సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. ఇవి మరువకముందే మరో ప్రముఖుడు తుదిశ్వాస విడిచాడు. కె.విశ్వనాథ్ తో మంచి అనుబంధం ఉన్న సీనియర్ ఎడిటర్ జీజీ కృష్ణారావు (GG Krishna Rao) కన్నుమూశాడు. బెంగళూరులోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచాడు. ఆయన మృతిపై సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఒక్క తెలుగు సినిమానే కాదు తమిళ్, కన్నడ, హిందీ సినిమాలకు ఎడిటర్ గా కృష్ణారావు పని చేశారు. తెలుగులో దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కె. విశ్వనాథ్, కె.రాఘవేంద్ర రావు, బాపు, జంధ్యాల వంటి వారి సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పని చేశారు. కె.విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం, సాగరసంగమం సినిమాలకు ఈయన కత్తెర పట్టారు. స్వాతిముత్యం, శుభలేఖ, సిరివెన్నెల, శ్రుతిలయలు, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, నాలుగు స్తంభాలాట, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలకు ఎడిటింగ్ పనులు కృష్ణారావు చేశారు. అలనాటి ప్రముఖ నిర్మాణ సంస్థలైన పూర్ణోదయ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ బ్యానర్ లలో కృష్ణారావు ఎడిటర్ గా పని చేశారు. జననీ జన్మభూమి సినిమాకు నిర్మాతగా కృష్ణారావు వ్యహరించారు. ఈయన దాదాపు రెండు వందలకు పైగా సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఎడిటింగ్ లో ఎందరికో గురువుగా కృష్ణారావు ఉన్నారు.
ఇటీవల కన్నుమూసిన కె. విశ్వనాథ్ కు కృష్ణారావు. అత్యంత ఆప్తుడు. ఆయన తీసిన ప్రతి సినిమాకు కృష్ణారావునే ఎడిటర్ గా తీసుకునేవారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. కృష్ణారావు మృతిపై వివిధ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి మనోధైర్యం దేవుడు ఇవ్వాలని తెలిపారు. మరికొందరు కృష్ణారావుతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.