చిరంజీవి… పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమా తెరపై మకుటం లేని మహారాజులాగా వెలిగిన హీరో ఆయన. టాలీవుడ్ అంటేనే మెగాస్టార్ అన్నట్లుగా ఉండేది. కానీ…. ఒక్కసారి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫూల్ అయ్యారు. ముఖ్యమంత్రి అవ్వాలనే లక్ష్యంతో పార్టీ పెట్టిన ఆయన.. దానిని ఎక్కువకాలం కాపాడుకోలేకపోయారు. రెండేళ్లకే… పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో చిరుపై చాలానే విమర్శలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు రాజకీయాలను కాస్త పక్కన పెట్టి…. ఆయన వరస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా.. తాజాగా.. ఆయన పొలిటికల్ జర్నీ పై ఆయనే కౌంటర్ వేసుకోవడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే… తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో చిరు తన రాజకీయ ప్రయాణం గురించి అనుకోకుండా ప్రస్తావించారు. ఈ విషయంలో తన మీద తాను సెల్ఫ్ ట్రోల్ వేసుకున్నారు. ఆర్టిస్టుగా సెటిలైన తర్వాత మరో వ్యాపకం వైపు, మరో వ్యాపారం వైపో నేను వెళ్లలేను.. అని చిన్న పాస్ ఇచ్చిన చిరు… పాలిటిక్స్‌లోకి వెళ్లావు కదా అనొద్దే. అది మధ్యలో ట్రై చేశాను. దాని గురించి వదిలేసేయండి అని వ్యాఖ్యానించాడు.
తన ప్రసంగంలో చిరు చాలా పంచ్‌లు వేసినప్పటికీ.. తన గురించి తాను వేసుకున్న ఈ పంచ్ బాగా వైరల్ అయింది. ఐతే దీన్ని సరదాగా తీసుకున్న వాళ్లు కొంతమందైతే.. చిరు మీద సీరియస్ అయిన వాళ్లు ఇంకొంతమంది. సరైన ప్రణాళిక లేకుండా రాజకీయాల్లోకి దిగి.. ఒక వైఫల్యం ఎదురు కాగానే రెండేళ్లకే పార్టీని అప్పటిదాకా తిట్టిపోసిన కాంగ్రెస్‌లో విలీనం చేసేసి.. కేంద్ర మంత్రి పదవిని అనుభవించి, పదవీ కాలం పూర్తయిన కొంత కాలానికే కాంగ్రెస్‌తో పాటు రాజకీయాలకు ముఖం చాటేయడం గురించి ప్రస్తావిస్తూ చిరును విమర్శిస్తున్నారు నెటిజన్లు.