»Ys Jagan Will Be Meet With Ministers And Mlas On 2024 Election
YS Jagan త్వరలో కీలక భేటీ.. ఎమ్మెల్యేల గుండెల్లో దడ
అతి విశ్వాసంతో ముందుకు వెళ్తున్న జగన్ కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని రాజకీయ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈసారి 175కు 175 సీట్లు అంటూ అతి విశ్వాసంతో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారని సమాచారం.
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాడు. పాలన కన్నా రాజకీయంపైనే ప్రధాన దృష్టి సారించిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్ త్వరలోనే ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే వై నాట్ 175 (ఎందుకు కాదు 175 సీట్లు) నినాదంతో సోషల్ మీడియాలో ప్రచారం పోటెత్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను రంగంలోకి దింపారు. ఈసారి 175కు 175 సీట్లు అంటూ అతి విశ్వాసంతో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కానున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీలో నివురుగప్పిన నిప్పుల అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యామ్నాయంపై చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిఘా ఉంచడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సీఎం జగన్ సమావేశం కానుండడంతో ఆ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్ క్షేత్ర స్థాయి సర్వే నివేదికలు తెప్పించుకున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పని తీరుపైన ఆగ్రహంతో ఉన్నారు. నెల్లూరు జిల్లా పరిణామాలు అందులో భాగమే. మరికొన్ని చోట్ల నెల్లూరు జిల్లా పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం ఉన్నవారికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలను పరోక్షంగా సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు ఆహ్వానం లేదని తెలుస్తున్నది. దీంతో ఎమ్మెల్యేలను బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపే చర్యలు ఉంటాయని సమాచారం.
మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో ఈ నెల 13వ తేదీన సీఎం జగన్ సమావేశం కానున్నారని సమాచారం. ఇప్పటికే పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమై ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే దానిపై సన్నాహాకాలు చేయనున్నారు. గత సమావేశంలో ప్రతీ సచివాలయ పరిధిలో కన్వీనర్లు, గృహ సారథుల నియామకంపై నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో వీరి నియామకంపై జగన్ గట్టిగానే హెచ్చరించారు. అయినా పరిస్థితిలో మార్పులేదు. ఇప్పుడు ఇదే అంశంపై మరోసారి ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అయితే గత సమావేశంలో దాదాపు 28 మంది ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి జగన్ సర్వే వివరాలను వెల్లడించారు. ప్రజల్లో గ్రాఫ్ పెరగకపోతే సీట్లు ఇవ్వటం కష్టమని ఆనాడే తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేల మెడపై కత్తి వాలుతోంది. పని తీరు మెరుగుపర్చుకోవడానికి అప్పుడు అవకాశం ఇవ్వగా తాజాగా వారి పరిస్థితిపై బేరీజు వేసే అవకాశం ఉంది. పరిస్థితి మారని ఎమ్మెల్యేలను సాగనంపేలా పరిణామాలు ఉండనున్నాయి.
పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లకు సంబంధించిన పనితీరుపై తయారుచేసిన రిపోర్టులు మూడు సర్వే సంస్థలు జగన్ కు నివేదిక సమర్పించినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో ఉంటున్న తీరుపై.. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఆధారంగా ఆ సంస్థలు మార్కులు వేసినట్లు సమాచారం. ఆ నివేదికలను సమావేశంలో బహిర్గత పరచి ఎవరు పద్ధతి మార్చుకోవాలి? ఎవరి పరిస్థితి ఎలా ఉంది అనేది సీఎం జగన్ చెప్పే అవకాశం ఉంది. కొందరి ఎమ్మెల్యేల పనితీరుపై హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్లు ఖరారు చేస్తామని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి కన్నా ముందే ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచనలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ఇన్నాళ్లు తాడేపల్లికే పరిమితమైన సీఎం జగన్ ఇక రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేయనున్నాడు. ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. 175కు 175 సీట్లు అనే తీరని అధికార దాహంతో జగన్ ముందుకు వెళ్లనున్నాడు. పార్టీ – ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ కార్యాచరణ సిద్దం చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తరువాత సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అతి విశ్వాసంతో ముందుకు వెళ్తున్న జగన్ కు ప్రజల నుంచి గుణపాఠం తప్పదని రాజకీయ మేధావులు హెచ్చరిస్తున్నారు.