మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగరంలో సందడి చేస్తున్నాయి. మొత్తం మూడు బస్సులను మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ బస్సులను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బస్సుల ప్రారంభోత్సవానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ కుమార్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బస్సులో ప్రయాణించారు.
ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బస్సు పర్యాటక ప్రాంతాల్లో రాకపోకలు సాగించనుంది. ఈ ఎలక్ట్రిక్ ఇంజన్ బస్సులతో పర్యావరణ హితంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 300 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని చెప్పిన టీఆర్ఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వాటిలో 10 బస్సులు డబుల్ డెక్కర్ ఉంటాయని గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగానే ప్రస్తుతానికి మూడు బస్సులు అందుబాటులోకి తీసుకురాగా.. మరో మూడు బస్సులు త్వరలో వస్తాయని అధికారులు తెలిపారు.
మళ్లీ సందడి
దాదాపు రెండున్నర దశాబ్దాల వరకు హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేసేవి. కాలక్రమంలో వాటి నిర్వహణ భారంగా భావించి ఆర్టీసీ ఆ బస్సులను రద్దు చేసింది. అయితే ఆ బస్సుల్లో ప్రయాణం అద్భుతంగా ఉంటుందని అందులో ప్రయాణించిన వాళ్లు గుర్తు చేసుకుంటుంటారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కు ట్విటర్ ద్వారా తెలపడంతో వెంటనే డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ ప్రవేశపెడతామని ప్రకటించారు. అందులో భాగంగానే తాజాగా తెలంగాణ ఆర్టీసీ డబ్బులు డెక్కర్ బస్సులను ప్రారంభించింది.
బస్సుల ప్రత్యేకత
– అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో బస్సులు తయారీ
– క్రికెటర్లు, వీఐపీలు ప్రయాణించే హై క్లాస్ బస్సులు సాధారణ ప్రజలకు చేరువ
– ఎలక్ట్రిక్ ఇంజన్ తో ఈ బస్సులు నడుస్తాయి.
– నీలం రంగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
– కింద భాగంలో సీటింగ్.. పై భాగంలో కూడా సీటింగ్
– నగరం అందాలు చూసేందుకు ఓపెన్ టాప్ సౌకర్యం
– సాధారణ బస్సుల మాదిరి ఛార్జీలు నామమాత్రమే
– ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో.. ప్రస్తుత బస్టాప్ ఎక్కడ అనే వివరాలు తెలిసేలా పెద్ద డిస్ ప్లే.