ప్రతి ఏటా విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2022లో 7,50,365 మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లారని ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. గత 6 ఏళ్లల్లో మొత్తం మీద 30 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రకటించారు. 2021లో 4,44,553 మంది విదేశాలకు వెళ్లిన విద్యార్థులతో పోలిస్తే 2022లో విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య 68% పెరిగిందని సుభాష్ సర్కార్ తెలిపారు.
మరోవైపు హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం 2017లో 4,54,009 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లగా, 2018లో 517,998 మంది, 2019లో 586,337 మంది విద్యార్థులు ఫారెన్ వెళ్లారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ సంఖ్య సగానికి పడిపోయి 2020లో 259,650కి తగ్గింది.
అయితే విదేశాల్లో భారతీయ విద్యార్థులు ఖర్చు చేస్తున్న డబ్బు దేశంలోని విద్యా బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ నిధులను ఆదా చేయడానికి “ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ హై స్టాండర్డ్”ని దేశంలో స్థాపించే ప్రతిపాదన ప్రభుత్వానికి ఉందా మంత్రిని ప్రశ్నించారు. కానీ ప్రస్తుతం దేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) దేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల క్యాంపస్ల ఏర్పాటుకు సులభతరం చేయడానికి నిబంధనలను రూపొందించినట్లు తెలిపారు.
అనేక మంది విద్యార్థులు దేశంలో విద్యను పక్కన పెట్టి విదేశాలకు వెళ్లిపోవడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విద్యా వ్యవస్థలో మార్పులతోపాటు..విదేశాల విద్యార్థులు ఇండియా వచ్చే విధంగా చేయాలని సూచించారు.