FLOOD : పెద్ద వాగుకు భారీ గండి.. జలదిగ్భంధంలో 14 గ్రామాలు
తెలంగాణ, ఏపీల్లో విస్తరించి ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దీంతో స్థానికంగా ఉన్న 14 గ్రామాలు బయటి ప్రాంతాలతో సంబంధాలను కోల్పోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
PEDDAVAGU PROJECT DAM BROKEN : తెలంగాణలోని పెద్ద వాగుకు భారీగా గండి ఏర్పడింది. ఏకంగా 250 మీటర్ల పొడవున గండి పడింది. దీంతో పలు గ్రామాల్లోని ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. మొత్తం 14 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండటంలోని కొత్తూరు, గుమ్మడవల్లి, కోయరంగాపురం, రమణక్కపేట గ్రామాలకు నష్టం వాటిల్లింది. అలాగే ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, కొత్తపూచిరాల, కోయమాదారం, పాతపూచిరాల, సొందిగొల్లగూడెం, వసంతవాడ, వేలేరుపాడు, గుళ్లవాయి గ్రామాలకు భారీ నష్టం జరిగింది.
ఈ గ్రామాలన్నీ జలదిగ్భంధంలో ఉండి బయటి ప్రాంతాలతో సంబంధాలను కోల్పోయాయి. ఫలితంగా అక్కడ ఏం జరుగుతోందో తెలియడం లేదు. సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సైతం అక్కడికి చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దాదాపుగా రెండు వేల కుటుంబాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు సమాచారం. గురువారం ఉదయం నుంచి అక్కడ కరెంటు కూడా నిలిచిపోయింది. సెల్ఫోన్లు సైతం పని చేయడం లేదు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు( Rains) ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో చాలా చెరువు గట్లు తెగి పడ్డాయి. దీంతో పెద్ద వాగులోకి(PEDDAVAGU) భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడానికి రెండు గేట్లను ఎత్తివేశారు. ఆ సమయంలో ఊహించనంత అధికంగా వరద వచ్చి వాగులో చేరింది. దీంతో ఆనకట్ట పై నుంచి నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. ఏ క్షణంలోనైనా కట్టకు గండి ఏర్పడవచ్చని అధికారులు భావించారు. అనుకున్నట్లుగానే గురువారం రాత్రి 7.45 గంటలకు గండి పడింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైంది.