తెలంగాణ ప్రభుత్వ తీరు చెప్పేవి గొప్పలు.. చేసేవి శూన్యం మాదిరి ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. 78 నుంచి 80 శాతం నిదులు ఖర్చు చేయలేదని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు.
‘ఇది ప్రజలను మోసం చేసేలా ఉంది. రైతాంగానికి రుణమాఫీ నాలుగేళ్లు అయినా చేయలేదు. అత్యధిక ఎగవేత దళారులు రైతులపై ముద్ర పడుతుంది. రైతు రుణమాఫీపై ఊసే లేదు.. చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలి. ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐలు సమయానికి చెల్లించలేక పోతున్నారు. సెర్ఫ్ ఉద్యోగులకు వేతనాలు పెంచలేదు. మధ్యాహ్న భోజనం వండే వారికి రూ.వెయ్యి ఇస్తున్నారు.. అవికూడా రెండేళ్లకోసారి ఇస్తే ఎలా? కేసీఆర్ కిట్ కు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. అంగన్ వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడం తో ముక్కి పోయిన ఆహారం అందుతుంది. బాసర త్రిపుల్ ఐటీలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గురుకులాల్లో సరైన వసతులు లేవు.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు’ అని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
‘మన ఊరు మన బడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుంది. ఈహెచ్ఎస్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ఇవ్వలేమంటున్నారు. ఆసుపత్రిలలో మందులు కూడా అందడం లేదు. విద్యా వాలంటర్లకు… విదేశీ విద్యకు వెళ్లే వారికి సరైన సమయానికి నగదు సాయం అందడం లేదు. కాంట్రాక్టర్ లకు ఏ శాఖలోను సమయానికి బిల్లు లు రాక ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పెట్టించి బెల్ట్, లిక్కర్ పాపులే. తెలంగాణ ప్రజలను తాగించి చంపుతున్నారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉంది’ అని ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.