యోగా గురువు రాందేవ్ బాబాపై కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని చైహాటాన్ ప్రాంతానికి చెందిన పఠాయి ఖాన్ అనే వ్యక్తి రాందేవ్ బాబాపై ఫిర్యాదు చేశాడు. బర్మార్ ప్రాంతంలో సాధువుల సమావేశంలో రాందేవ్ ముస్లింల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా మాట్లాడుతూ ముస్లింలు విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని చెబుతూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాందేవ్ బాబాపై ఫిర్యాదు చేసినట్లు పఠాయి ఖాన్ తెలిపారు. ఎస్హెచ్ఓ మాట్లాడుతూ భారత శిక్షస్మృతిలోని సెక్షన్ 153ఏ, 295ఏ, 298 వంటి వాటి కింద రాందేవ్ బాబాపై కేసు నమోదైట్లు తెలిపారు.
ఫిబ్రవరి 2న జైపూర్‌లోని బర్మెర్‌లో సాధువుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాందేవ్ మాట్లాడుతూ..ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారని, నమాజ్ తర్వాత వాళ్లేం చేయాలనుకుంటున్నారో అది చేస్తారని అన్నారు. హిందూ అమ్మాయిలను ముస్లింలు కిడ్నాప్ చేస్తారని, వాళ్లు అన్నిరకాల పాపాలకు పాల్పడతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ హిందూ మతం అలాంటిది కాదని, కేవలం మంచి చేయమని మాత్రమే చెబుతుందని అన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని భావించిన రాందేవ్ తాను ఎవరినీ విమర్శించడం లేదన్నారు. జరుగుతున్న వాస్తవం చెబుతున్నానని వివరణ ఇచ్చారు.
కొందరు వ్యక్తులు యావత్ ప్రపంచాన్ని ఇస్లాం స్టేట్‌గా మారుస్తామని, ఇంకొందరు క్రైస్తవంలోకి మారాలని చెబుతుంటారని, వారికి అంతకుమించి ప్రత్యేక ఎజెండా అంటూ ఏదీ ఉండదని రాందేవ్ బాబా అన్నారు. ముస్లింలు టెర్రరిస్టులుగా, నేరస్థులుగా మారుతున్నప్పటికీ నమాజ్ మాత్రం చేస్తుంటారని అన్నారు. మంచి ఆలోచనలు చేయాలని, ఇష్టదైవాన్ని పూజించాలని హిందూయిజం చెబుతుందని రాందేవ్ బాబా అన్నారు. రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలపై పఠాయి ఖాన్ అనే వ్యక్తి ఆదివారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.