తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతానని స్పష్టం చేశారు. ప్రతి సబ్ స్టేషన్లో కరెంట్ రికార్డులు ఉంటాయని…అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో ఇస్తున్న కరెంట్ రికార్డులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు అసలు రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో కరెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నారో విద్యుత్ శాఖ అధికారులకే తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతి పక్షాలు శాసనమండలిలో ప్రశ్నలు అడిగితే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.