మహారాష్ట్రలోని నాందేడ్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు.
భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు. మన దేశంలో భూమి ఉంది, నీళ్లూ ఉన్నాయి. భారత్ మేధావుల దేశం. ప్రజలకు సమస్యలు అర్థమైనప్పుడే మేం బలవంతులం అనుకునే నేతల పతనం తప్పదు. మీరే పండించాలి.. మీరే అమ్ముకోవాలి.. అప్పుడే రైతురాజ్యం సాధ్యం అవుతుందన్నారు.
జోక్ ఇన్ ఇండియాగా మారిన మేకిన్ ఇండియా
మేకిన్ ఇండియాజోక్ ఇన్ ఇండియా అయింది. ఎక్కడ పోయింది అది. దేశంలోని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా చైనా బజార్ ఉంది. పతంగుల మాంజా చైనా నుంచి వస్తుంది. టపాసులు, జాతీయ జెండాలు, గణేశ్ విగ్రహాలు ప్రతి ఒక్క వస్తువు చైనా నుంచి వస్తుంది. మన దేశంలో తయారయ్యే వస్తువులే లేవా. చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి. ఎక్కడ చూసినా చైనా బజార్ కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను సోదరుడిని. మీ కొడుకును. నేను చాలా బాధపడుతూ చెబుతున్నా అని సీఎం కేసీఆర్ అన్నారు.
మన దేశంలో ఒక్క పెద్ద రిజర్వాయర్ అయినా ఉందా?
50 వేల టీఎంసీలు సముద్రంలో ఊరికే కలిసిపోతున్నాయి. ఇది మన జీవన మరణ పోరాటం. ఇంకా ఎన్నేళ్లు పోరాడుదాం. ఇంకా ఎన్నేళ్లు సహించుకుంటూ వెళ్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద రిజర్వాయర్ జింబాబ్వే అనే చిన్న దేశంలో ఉంది. అలా.. ప్రతి దేశంలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. 5 వేల టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు చాలా ఉన్నాయి. మనది ఇంత పెద్ద దేశం. ఇంత జనాభా ఉన్న దేశంలో కనీసం మూడు నాలుగు రిజర్వాయర్లు అయినా ఉండాలా వద్దా. ఎందుకు మన సర్కార్ కట్టడం లేదు. వీళ్లు కట్టరు అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో సాధ్యం అయినప్పుడు దేశమంతా ఎందుకు సాధ్యం కాదు
నేను తెలంగాణ ముఖ్యమంత్రిని. ఒకప్పుడు తెలంగాణలో సాగు నీరు లేదు. కరెంట్ లేదు. తాగునీరు లేదు. రైతుల ఆత్మహత్యలు పెరిగేవి. ఇప్పుడు సాగునీరు ఉంది. తాగు నీరు అందిస్తున్నాం. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతన్నలకు. 50 మోటర్లు పెట్టుకున్నా రూపాయి కూడా తీసుకోవడం లేదు. రైతు చనిపోయిన 4 రోజుల్లోనే బీమా డబ్బులు ఇస్తున్నాం. రైతు బంధు ఇస్తున్నాం. రైతులు పండించిన పంటను పూర్తిగా ప్రభుత్వమే కొంటోంది. తెలంగాణలో సాధ్యం అయినప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదు. రైతు రాజ్యం వస్తే కరువు ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు.