BRIDGE COLLAPSED AGAIN : ఈ మధ్య కాలంలో బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అదే పంథాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన పరిస్థితి కూడా తయారైంది. గాలి దుమారానికే వంతెన కూలిపోయింది. ఇది మొదటి సారి కాదు. 70 రోజుల క్రితం ఒకసారి ఇలాగే కురిసిన వర్షాలకు మూడు గడ్డర్లు కూలిపోయాయి. మళ్లీ ఇప్పుడు సైతం ఇదే సీన్ రిపీట్ అయ్యింది. మంగళవారం సాయంత్రం అక్కడ భారీగా గాలి వీచింది. దీంతో 17, 18 నంబరు పిల్లర్లపై ఉన్న ఐదు గడ్డర్లు నేల కూలాయి.
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల దగ్గర గర్మిళ్లపల్లిలో మానేరు వాగుపై(maneru vagu) ఈ వంతెనను(Bridge) నిర్మించడం ప్రారంభించారు. 2016లో దీని నిర్మాణం ప్రారంభం అయ్యింది. అప్పట్లో రూ.49 కోట్ల వ్యయం అంచనాలతో దీన్ని ప్రారంభించారు. ప్రారంభమై ఇప్పటికి ఎనిమిదేళ్లకు పైగా కావొస్తోంది. దీని పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. గాలి దుమారానికే గుడ్డర్లు కూలి పడుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఈ ప్రమాదాలు జరగడంతో ఇప్పటి వరకు ఎలాంటి హానీ జరగలేదు. అదే మనుషులు తిరిగే సమయంలో ఇవి కూలితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో వర్షాలు, వాగులో వస్తున్న వరదలకు వంతెన కోసం వాడుతున్న సామగ్రి మొత్తం తడిచిపోతున్నాయి. ఫలితంగానే ఇలా గడ్డర్లు కూలుతున్నాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. అధికారులు ఈ విషయమై దృష్టి సారించాలని కోరుతున్నారు. సమగ్రంగా దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవాలని అంటున్నారు.