Side Effects of Brinjal : కూరల్లో రారాజుగా చెప్పుకునే వంకాయ అంటే చాలా మందికి ఇష్టం. రకరకాల వంటకాలు చేసుకుని దీన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం వీటికి కచ్చితంగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే…? కొంత మందికి ఎముకల సాంద్రత తక్కువగా ఉంటుంది. తరచుగా ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వారు కచ్చితంగా వంకాయలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కాల్షియంని శరీరం శోషించుకోకుండా చేస్తాయి. ఫలితంగా ఎముకలు మరింత బలహీనపడతాయి.
కిడ్నీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్న వారు సైతం వంకాయల్ని(Brinjal) తక్కువగా తినాలి. వీటిలో ఉండే ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని పెంచుతాయి. కాబట్టి రాళ్ల సమస్యలు ఉన్న వారు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2013లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినే వ్యక్తుల్లో 23 శాతం ఈ ప్రమాదం పెరుగుతుందని తేల్చింది.
కొంత మందికి వంకాయలు(Brinjal) తింటే దురదల్లాంటి సమస్యల్లాంటివి వస్తాయి. అలర్జీ ఉన్న వారు సైతం వీటికి దూరంగా ఉండాలి. కళ్ల వాపులు, కళ్లు ఎర్రబడటం, వాపుల్లాంటి ఇబ్బందులు ఉన్న వారు కూడా వీటిని తినే విషయంలో జాగ్రత్త వహించాలి. రుమటాయిడ్ మోకాళ్ల సంబంధ నొప్పులతో ఇబ్బందులు పడేవారు వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పైల్స్ ఉన్న వారు సైతం వీటికి దూరంగా ఉండాలి. వంకాయల్లో సోల్యుబుల్, అన్సోల్యుబుల్ ఫైబర్లు రెండూ ఉంటాయి. కాబట్టి జీర్ణ సంబంధ ఇబ్బందులు ఉన్న వారు సైతం వీటిని తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.