»Google Map Lands Two Youths In River In Kerala Rescued
Google Maps : గూగుల్ మ్యాప్స్ ప్రకారం కారు నడిపారు.. నదిలో మునిగారు!
గూగుల్ మ్యాప్ చూపిస్తున్న దారి ప్రకారం ఇద్దరు యువకులు కారు నడిపారు. ఎదురుగా నీరున్నా రోడ్డనుకుని పోనిచ్చారు. దీంతో ఆ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. తర్వాత ఏమైందంటే?
Google Map : దారి తెలియని చోట ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కారు నడిపేందుకు గూగుల్ మ్యాప్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే కేరళలో జరిగిన ఓ ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. గూగుల్ మ్యాప్ చూపించినట్లుగా వెళ్లిపోతే కొన్ని సార్లు ప్రమాదాల్లోనూ ఇరుక్కుపోవచ్చని ఈ ఘటన నిరూపించింది. ఇంతకీ ఏమైందంటే..? ఇద్దరు యువకులు(two youths) కారులో ప్రయాణిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఆసుపత్రికి వెళ్లడానికి కేరళ నుంచి బయలుదేరారు. కేరళలోని కాసరగఢ్ జిల్లాలో వారు కారు నడుపుతున్నారు. దారి తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్‌ని(Google Maps) అనుసరిస్తున్నారు.
అలా వెళుతున్నప్పుడు వారికి ఓ నది ఎదురైంది. వర్షాల వల్ల రోడ్డే అలా నీటితో నిండి ఉందని వారు భావించారు. గూగుల్ మ్యాప్స్(Google Maps) సైతం అటే దారి చూపించడంతో వారు కారును నీటిలోకి పోనిచ్చారు. అయితే వర్షాల కారణంగా ఆ నది మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కారు నీటిలో కొట్టుకుపోవడం ప్రారంభం అయ్యింది. అదృష్ట వశాత్తూ అది ఓ చెట్టును గుద్దుకుని అక్కడ చిక్కుకుంది. దీంతో ఆ ఇద్దరు కారు డోర్లను తీసి బయటకు వచ్చారు. ప్రాణాలతో బయట పడగలిగారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాళ్ల సాయంతో ఆ ఇద్దరు యువకుల్నీ ఒడ్డుకు లాగారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉంది. మేము ప్రాణాలతో బయట పడతామని అనుకోలేదు. ఇది మాకు పునర్జన్మలా ఉంది అని ఆ యువకుల్లో ఒకరైన రషీద్ అన్నారు.