Hyderabad: Implementation of Section 144 in those areas
Hyderabad: హైదరాబాద్ నగరంలోని మియాపూర్, చందానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ నెల 29 అర్ధరాత్రి వరకు ఇది అమలులో ఉంటుందని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మియాపూర్‌లో ఉన్న ఉద్రిక్తల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. మియాపూర్‌లో వివాదాస్పదంగా మారిన భూములను అవినాష్ మహంతి పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిన్న రాజధాని శివారులోని సర్కారు భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్‌నగర్ సమీపంలోని సర్వే నంబరు 100, 101లో దాదాపు 525 ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు 2 వేల మంది ప్రయత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేశారు. వాళ్లు పోలీసులపై రాళ్లు వేయడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది. దీంతో ఈరోజు 144 సెక్షన్ విధించారు.
దేశ విభజన సందర్భంగా ఇక్కడి నుంచి పాకిస్థాన్‌కు తరలిపోయిన వ్యక్తులకు చెందిన (అవెక్యూ) భూముల కింద ఈ 525 ఎకరాలను పరిగణిస్తూ గతంలో ప్రభుత్వం హెచ్ఎండీఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ భూములను తాము గతంలో కొనుగోలు చేశామని 32 మంది కోర్టు కెళ్లారు. కింది కోర్టుల నుంచి హైకోర్టు వరకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ భూమి గజం లక్ష వరకు పలుకుతుండటంతో చాలామంది రాజకీయ నేతలు, ఆక్రమణదారుల కళ్లు వీటిపై పడ్డాయి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లెక్క చేయడం లేదు.