»Do You Know About Hero Vijay Tamiliga Vetri Kazhagam Party
Vijay: హీరో విజయ్ తమిళిగ వెట్రి కజగం పార్టీ గురించి మీకు తెలుసా?
తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఆసక్తిని రేపుతోంది. హీరో విజయ్ ప్రారంభించిన ఈ పార్టీ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను కలిగిన విజయ్...రాజకీయంగా కూడా రాణించగలడని పరిశీలకులు చెబుతున్నారు. ఇంతకీ విజయ్ పార్టీని ఎప్పుడు ప్రారంభించాడు? ఆ పార్టీ ప్రస్తుతం ఏ దశలో ఉంది? విజయ్ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది?
Do you know about Hero Vijay Tamiliga Vetri Kazhagam Party?
Vijay: తమిళనాడులో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. కరుణానిధి, ఎంజీఆర్ వంటి సినీ ప్రముఖులు ….రాజకీయాల్లో చేరిన నాటి నుంచి ఆ రాష్ట్ర ప్రజలకు రాజకీయాలపై అవగాహన పెరుగుతూ వచ్చింది. హీరోయిన్ జయలలిత కూడా అప్పట్లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో సామాన్యులు కూడా రాజకీయాల గురించి ప్రతి రోజు చర్చించుకునేవారు. కాల క్రమంలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు…తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా సేవలందించారు. వారిని ప్రేరణగా తీసుకుని …సినీ రంగం నుంచి అనేక మంది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, రాధిక…రాజకీయాల్లో ప్రవేశించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అనేకసార్లు పిల్లిమొగ్గలు వేసి రాజకీయాల నుంచి వైదొలిగారు. ఆరంభం కాకముందే ఆ పార్టీ అంతమయింది.
తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్లో పాపులారిటీ సాధించిన విజయ్….రాజకీయంగా ఎదిగేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళ వెట్రి కజగం అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ప్రస్తుతం ఎటువంటి హంగామా లేకుండా … పార్టీని నిర్మించే పనిలో ఉన్నాడు. ఒక మంచి టీమ్‌ను తయారు చేసుకున్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకుని ముందకు కదులుతున్నాడు. ఈ లోగా తమిళనాడులో జరిగే ఏ ఎన్నికలోనూ పోటీ చేసేది లేదని స్పష్టం చేశాడు. విజయ్ …తన కార్యాచరణను ఒక పద్దతి ప్రకారం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా రాష్ట్ర స్థాయిలో ఓ పబ్లిక్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నాడు. ఆ కాన్ఫరెన్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు పార్టీ నిర్మాణ దశలోనే ఉన్నప్పటికీ…వెట్రికజగం పార్టీలో చేరేందుకు అనేక మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు.
డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్, కేపీవై బాలా వంటి వారు విజయ్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వారిద్దరూ ప్రస్తుతం తమ సొంత ఖర్చులతో అనేక మందికి ఆర్ధిక సాయం చేస్తున్నారు. లారెన్స్ ఏకంగా మాట్రం అనే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి….తనకు తోచిన రీతిలో సమాజ సేవ చేస్తున్నాడు. రైతులకు తన సొంత డబ్బులతో ట్రాక్టర్లు కొని పంపిణీ చేశాడు. కేపీవై బాలా కూడా చిన్న వయసులోనే సమాజ సేవ చేస్తూ అందరి ప్రసంశలు అందుకుంటున్నాడు. రాజకీయాల్లో చేరి ప్రజలకు మరింత సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. విజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ తాను ఒప్పుకున్న సినిమాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమాలన్నీ పూర్తికాగానే …. రాజకీయంగా మరింత చురుగ్గా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ జనాల్లో రావడం మొదలు పెడితే.. మరింత మంది ప్రముఖులు వెట్రి కజగం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.