ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కొడాలి నాని సంచలన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. లోకేష్ విమర్శలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నందమూరి తారక రామారావు మృతిపై విచారణ జరిపించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ మృతిపై మిస్టరీ వీడాలన్నారు.
తారక రామారావు రాష్ట్ర సంపద అని, ఆయన ఎలా చనిపోయారో అందరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తానని చెప్పారు. ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్లు, హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలపై కూడా విచారణ చేయాల్సిందేనని చెప్పారు. ఈ మేరకు కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరుతామని చెప్పారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు హంతకులను పట్టుకోలేదని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో చంద్రబాబు,లోకేష్, అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, కడప జిల్లా ఎస్పీతోపాటు టీడీపీ నేతల ఫోన్ కాల్స్ పైనా విచారణ చేయాలన్నారు. వివేకా హత్యకు ముందు ఆ తర్వాత వీళ్లంతా ఏమేం మాట్లాడుకున్నారో కూడా విచారణ చేయాలన్నారు.