బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్‌ను గురువారం ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ విమానాశ్రయంలో చెంప దెబ్బ కొట్టారు. ఈ ఘటనపై వీరిరువురూ ఏమని స్పందించారంటే..?
Kangana Ranaut:బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఒకరు ఆమెను చండీగఢ్ విమానాశ్రయంలో చెంప దెబ్బ కొట్టారు. దీంతో కంగనా నిర్ఘాంత పోయారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ విషయమై కంగనా రనౌత్(Kangana Ranaut) సైతం స్పందించారు. మహిళా కానిస్టేబుల్ తనను చెంప దెబ్బ కొట్టిన విషయాన్ని ధ్రువీకరించారు.
తాను విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ వద్ద ఉండగా ఈ ఘటన జరిగిందని కంగన(Kangana) అన్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ అకస్మాత్తుగా తన దగ్గరకు వచ్చి ముఖంపై కొట్టి, తిట్టడం మొదలు పెట్టిందని తెలిపారు. ఎందుకు కొట్టావని ప్రశ్నించగా రైతు ఉద్యమానికి మద్దతుగానే తానీ పని చేశానని ఆమె చెప్పిందన్నారు. పంజాబ్‌లో ఇలాంటి ఉగ్ర వాద ధోరణులు ఉన్నాయంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు.
ఈ విషయమై మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ సైతం ఓ వీడియో ద్వారా తన వాదనను వినిపించారు. దిల్లీలో నెలల తరబడి ధర్నాలో(Farmers Protest) కూర్చున్న రైతులపై కంగనా(Kangana) అవమానకరంగా మాట్లాడారని ఆమె అన్నారు. ఆ ధర్నాలో తన తల్లి కూడా కూర్చున్నారని ఆమె చెప్పుకొచ్చారు. రైతులకు రూ.100, రూ.200 ఇవ్వడం వల్లే దిల్లీలో వారంతా ఆందోళనలో కూర్చుంటున్నారని కంగనా ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు. అందుకనే ఆమె కనబడగానే కొట్టానంటూ చెప్పుకొచ్చారు. ఈ పని చేసినందుకుగాను ఆమెను సస్పెండ్ చేశారు. ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. ఆమెపై అంతర్గత విచారణ సైతం జరగనుంది.