kangana ranaut : ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చేయడం కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టమన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం(election campaigning) కోసం పడుతున్న కష్టాల ముందు సినిమా( movie) కష్టాలు చాలా తక్కువేనని ఆమె అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను వరుసగా ఆరు ప్రజా సభల్లో పాల్గొన్నానని చెప్పారు. ఎన్నో మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నారు. కష్టమైన రోడ్లలో, పర్వత ప్రాంతాల్లో ఒక్కరోజే 450 కిలోమీటర్లు ప్రయాణించానన్నారు. నిద్ర లేని రాత్రులు, సమయానికి భోజనం లేకపోవడం లాంటివి చాలా ఉంటాయని చెప్పారు. ఇవన్నీ చూశాక సినిమా తీయడానికి పడే కష్టాలు జోక్‌లా అనిపిస్తున్నాయని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
హిమాచల్ ప్రదేశ్‌లో మండి లోక్ సభ స్థానం నుంచి కంగన(Kangana) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 14న ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా కంగన స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉండటంతో చిత్రం మరింత ఆలస్యం అవుతోందని చిత్ర బృందం ఈ మధ్యనే ప్రకటించింది.