ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాస రావు)కు ఊహించని సంఘటన ఎదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దని కోరుతూ రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టేశారు. ఈ సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది.
భీమిలి మండలం కె.నగరపాలెంలో గురువారం ఎమ్మెల్యే శ్రీనివాస రావు పర్యటించారు. ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని చెబుతూ కొందరు యువకులు రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండ కట్టడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాన్ని తొలగించారు. అయితే టీడీపీ గ్రామ మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబును అదుపులోకి తీసుకున్నారు. సూరిబాబు అరెస్ట్ ను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం అలుముకుంది. అనంతరం పోలీసులు వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.