పరిపాలన రాజధానిగా కొన్ని నెలల్లో విశాఖపట్టణాన్ని చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పలు కార్యాలయాలు తరలించేందుకు సిద్ధమైంది. విశాఖ నుంచే పరిపాలన సాగించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఇక ఏపీ రాజధాని విశాఖనే అని చాటి చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అందుకే అన్ని కార్యక్రమాలకు విశాఖతో ముడి పెడుతున్నారు. తాజాగా విశాఖపట్టణంలో ప్రముఖ హోటల్ కు 40 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది.
విశాఖపట్టణంలో హోటల్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఫైవ్ స్టార్ హోదా పొందిన అత్యంత విలాసవంతమైన హోటల్స్ నిర్వహించే ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి 40 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామ పంచాయతీ వద్ద రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చేసింది. లీజ్ కమ్ రెంట్ ప్రాతిపదికన భూమి ఇచ్చింది.
కలెక్టర్ మల్లికార్జునతోపాటు రెవెన్యూ అధికారులు ఆదివారం ఒబెరాయ్ గ్రూప్ సీఈఓ విక్రమ్ ఒబెరాయ్, సంస్థ కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడు రాజా రామన్ శంకర్, ముఖ్య ఆర్థిక నిర్వహణ అధికారి కల్లోల్ కుందుల తదితరులకు కేటాయించిన భూమిని చూపించారు. వారి వెంట రాష్ట్ర పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్ రెడ్డి, విశాఖ పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి, భీమిలి ఆర్డీవో భాస్కర రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.