రైళ్లలో జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి రూ.20కే భోజనం ఇచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ప్రయోగాత్మకంగా వంద స్టేషన్లలో ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Railway Food Price In Train : ఇక రైళ్లలో ప్రయాణించే వారికి అతి తక్కవ ధరకే భోజనం లభిస్తుంది. జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి రూ.20కే ఆహారం, రూ.3కే తాగు నీటిని రైల్వే ఐఆర్సీటీసీ(IRCTC) అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న 100 రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా 150 ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. రూ.20కి, రూ.50కి రెండు ఫుడ్ ఆప్షన్లను తయారు చేసింది. వీటిల్లో మెనూ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇరవై రూపాయలకు ఇచ్చే ఫుడ్ ప్యాక్‌లో ఏడు పూరీలు (175 గ్రాములు), బంగాళదుంప కూర(150 గ్రాములు), పచ్చడిని కలిపి ఇస్తారు. అలాగే యాభై రూపాయలకు అందించే భోజనం ప్యాక్‌లో అన్నం, కిచిడి, ఛోలే కుల్చా, ఛోలే భాతూర్, పావ్ భాజీ, మసాలా దోశల్లో ఒక దాన్ని ఎంచుకుని తీసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తారు. తక్కువ ధరలో రైలు ప్రయాణికులకు శుచి అయిన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లక్నో డివిజన్ సీనియర్ డీసీఎం రేఖా శర్మ తెలిపారు.
ప్లాట్‌ఫాంలపై జనరల్ బోగీలు ఆగే చోటుకు బయట వైపున ఈ ఫుడ్ కౌంటర్లు ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో(RAILWAY STATIONS) ఇలా 150 కౌంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తులో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు వెల్లడించారు. లక్నో జంక్షన్, గోరఖ్‌పూర్, సివాన్ జంక్షన్, బనారస్ జంక్షన్… లాంటి పలు స్టేషన్లలో ఈ స్టాల్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.