కొంత మందికి ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్(Sweet Cravings) ఉంటాయి. మిగిలిన ఏ పదార్థాల మీదా ఉండని ఇష్టం తీపి పదార్థాల మీద ఉంటుంది. ఎంత తిన్నా అదే తినాలని అనిపిస్తూ ఉంటుంది. అలా తీపి ఎక్కువగా తినడం వల్ల కలిగే అనారోగ్యాలు ఎన్నో. అందుకనే సాధ్యమైనంత వరకు తీపిని తగ్గించి తినేందుకు ప్రయత్నించాలి. ఒక వేళ మీరూ అదే ప్రయత్నంలో ఉంటే ఈ చిట్కాలను పాటించి చూడండి.
మనం తీపి తిన్నప్పుడు మనలో డోపమైన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. దాని గురించే మనకు పదే పదే తీపి(sugar) తినాలని అనిపిస్తుంది. ఇలా స్వీట్ అధికంగా తినడం వల్ల పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి మధుమేహం లాంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకనే దీన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తినే ఆహారంలో సరళ కార్బోహైడ్రేట్లను కాకుండా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. తీపి తినాలన్న ఆలోచన తొందరగా కలగకుండా ఉంటుంది. చికెన్, గుడ్లు, ప్రొటీన్ షేకుల్లాంటివి తాగడం వల్ల ప్రొటీన్లు ఎక్కువగా అందుతాయి. అలాగే ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. పెరుగు లాంటి వాటిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. అందులో ఉండే మంచి బ్యాక్టీరియాలు పేగులకు మేలు చేస్తాయి. పేగులు ఆరోగ్యంగా ఉండి, అందులో మంచి బ్యాక్టీరియాలు పుష్కలంగా ఉంటే తీపి తినాలనే కోరిక ఎక్కువగా కలగకుండా ఉంటుంది. ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా మనకు తీపి తినాలని అనిపిస్తుంది. కాబట్టి అలాంటి జీవన విధానానికి దూరంగా ఉండాలి. పనుల్ని ప్రణాళిక ప్రకారం ప్రశాంతంగా చేసుకునే ప్రయత్నం చేయాలి.