తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3వ తేదిన నుంచి శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పిబ్రవరి 3వ తేదీ శుక్రవారం రోజున సమావేశాలను ప్రారంభించనున్నట్లుగా స్టేట్ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహాచార్యలు ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే సమాచారం అందించారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 2. 85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చన్నది విశ్వసనీయ సమాచారం. గతంలోలాగానే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మరోవైపు.. ఈసారి బడ్జెట్ సమావేశాలను సుదీర్ఘంగా నిర్వహించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అన్ని అంశాలపై చర్చ జరిగేలా, ప్రభుత్వం నిర్వహిస్తోన్న కార్యక్రమాలన్ని అసెంబ్లీ వేదికగా జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సమావేశాలు.. ఈసారి మూడువారాల పాటు నిర్వహించనున్నట్టు సమాచారం.