Summer : ఎండాకాలం కార్లలో వీటిని మాత్రం అస్సలు పెట్టొద్దు.. పేలొచ్చు!
ఎండాకాలంలో కార్లలో కొన్ని వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. అవి మంటల్ని రేకెత్తించేంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం రండి.
Things can not put in car in Summer : ఎండలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కార్లలో బయటకు వెళ్లినా ఎండతాపం తట్టుకోవడం కష్టంగానే ఉంటోంది. అయితే ఇలా కార్లలో బయట ప్రయాణాలు చేసేవారు వేసవికాలంలో(Summer) కొన్ని జాగ్రత్తల్ని తప్పకుండా తీసుకోవాలి. కార్లలో కొన్ని వస్తువుల్ని ఉంచితే అవి మంటల్ని ప్రేరేపించే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఆ వస్తువుల విషయంలో అవగాహనతో ఉండటం ఎంతైనా అవసరం.
కార్లను వేడి ప్రదేశాల్లో పార్క్ చేసినప్పుడు అందులో అద్దం లాంటివి లేకుండా చూసుకోవాలి. వేడి దాని మీద అదే పనిగా ప్రసారం అయితే దాని నుంచి పొగ, మంట వచ్చే అవకాశాలుంటాయి. అలాగే ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎలక్ట్రిక్ డివైజ్‌లు లేకుండా చూసుకోవాలి. వాటిల్లో ఉండే బ్యాటరీల వల్ల పేలుడు ప్రమాదాలు ఉంటాయి. అలాగే పాడైపోయిన పాత బ్యాటరీలు గాని, కొత్త బ్యాటరీలనుగాని కార్లలో ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేయకూడదు. ఇంకా సెంట్ స్ప్రేలు, పెయింట్ స్ప్రే డబ్బాల్లాంటి వాటిని ఉంచకూడదు. వీటిల్లో ఉండే ఆల్కహాల్ వల్ల వేడి పెరిగితే ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మంటలు వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది.
కార్బోనేటెడ్ డ్రింక్‌లు, మద్యం బాటిళ్లలాంటి వాటిని కారులో(car) ఉంచి ఎండలో పార్క్ చేసి వదిలేయకూడదు. అలాగే హ్యాండ్ శానిటైజర్లను కూడా కారు లోపల ఉంచేయకూడదు. వీటిల్లో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద మంటల్ని సృష్టిస్తాయి. కొంత మందికి సిగరెట్లలాంటివి కాల్చే అలవాటు ఉంటుంది. అలాంటి వారు లైటర్లను వాడుతుంటారు. వాటిని కార్లలో ఉంచడం ఏ మాత్రం మంచిది కాదు. అలాగే కార్ డ్యాష్‌బోర్డ్ పైన చాలా మంది సన్ గ్లాసెస్‌ని పెడుతుంటారు. ఈ పని కూడా ఎప్పుడూ చేయకూడదు. అది భూతద్దంలా పని చేసి అగ్ని ప్రమాదానికి కారణం కావొచ్చు.