KCR: గెలిచి ఉంటే.. ఈపాటికే దేశంలో సగం అగ్గిపెడుతోన్ని
కరీంనగర్ కదనభేరి సభలో కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, అటు బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతా అంటున్నారు. పేగులు మెడలో వేసుకుంటా, మానవ బాంబును అవుతా అని అంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రసంగించారు.
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కరీంనగర్ కదనభేరి సభలో ప్రసంగించారు. తెలిసో తెలియకో ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారు. ఇప్పుడు రైతు బంధు రావడం లేదు, కరెంట్ రావడం లేదు రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతా అంటున్నారు, పేగులు మెడలో వేసుకుంటా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని కేసీఆర్ తెలిపారు. ఎవరికి భయపడేది లేదని కరీంనగర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ బండి సంజయ్ ఏం చేశాడని ప్రశ్నించారు. ఆయన కన్న వినోద్ ఎన్నో రెట్లు నయం అని ప్రజలకు తెలిపారు.
ప్రజలు ఆవేశపడి ఓడించారు కానీ అసంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉంటే ఈపాటికే దేశంలో చిచ్చు పెడుతుండే, సగం అగ్గి రాజేస్తుండే అని వ్యాఖ్యానించారు. ఎవరు బాధ పడొద్దు, వచ్చే ఎన్నికల్లో ఏంపీలు గెలిచి మన సత్తా ఏంటో చూపిద్దాం అని అన్నారు. ఎవరు తమషాకు ఓట్లు వేయొద్దని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే పోలీసులు స్థానికులను భయపెడుతున్నారని, పోలీసులకు రాజకీయాలతో ఏం సంబంధం అని ప్రశ్నించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని వెల్లడించారు. గుండెలనిండ జై తెలంగాణ అనాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే సాధ్యం అని అన్నారు.