జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 200 సార్లకు పైగా వ్యాక్సిన్ వేయించుకున్నాడట. ఈ విషయం తెలియడంతో శాస్త్రవేత్తలు అతడిపై అధ్యయనం చేయగా.. అధ్యయనంలో ఏం తెలిసిందో వివరాల్లో తెలుసుకుందాం.
Vaccination: కరోనా ప్రపంచాన్ని వణికించింది. కొవిడ్ బారి నుంచి తప్పించుకోవడానికి చాలామంది వ్యాక్సిన్లు వేసుకున్నారు. వ్యాక్సిన్ రకాన్ని బట్టి వీటిని వివిధ డోసుల్లో వేశారు. కొందరు అయితే ఒకటి కంటే ఎక్కువసార్లు టీకాలు వేసుకున్నారు. ఇలా జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 200 సార్లకు పైగా వ్యాక్సిన్ వేయించుకున్నాడట. ఈ విషయం తెలియడంతో శాస్త్రవేత్తలు అతడిపై అధ్యయనం చేశారు. అతను 217 సార్లు టీకా తీసుకున్నట్లు తెలిపాడు. కానీ అధికారిక వివరాలు ప్రకారం 134 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు.
ఎక్కువసార్లు వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవడానికి ఎర్లాంగెన్-నర్న్‌బర్గ్‌లోని ఫ్రెడ్రిక్ అలగ్జాండర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అతని శరీరంపై పలు పరీక్షలు చేశారు. సాధారణంగా హెచ్ఐవీ, హెపటైటిస్ బి వంటి దీర్ఘకాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవాళ్లు నిరంతరం టీకాలు తీసుకుంటే మంటలు కలిగిస్తుంది. ఎక్కువసార్లు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలోని టి లాంటి కణాలు అలసిపోతాయని.. అవి ప్రొ-ఇన్ఫ్లమేటరీని తక్కువగా విడుదల చేస్తాయని అధ్యయనాలు తెలిపాయి.
దీనివల్ల రోగనిరోధకశక్తి తగ్గుతుంది. కానీ ఆ వ్యక్తి శరీరంలో కొవిడ్‌పై పోరాడే టి-కణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధ్యయంలో తేలింది. సాధారణ సంఖ్యలో వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో ఎలా టి-కణాలు సమర్థంగా పనిచేస్తున్నాయి.. అతనిలో కూడా అలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అతని రోగనిరోధకశక్తి బలహీనపడినట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.