Ponnam prabhakar: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని ఆయన అన్నారు. అసలు నా తల్లికి, రాజకీయాలతో ఆమెకు ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. అసలు బండి సంజయ్ ఎంపీగా తెలంగాణ, హుస్నాబాద్‌కు ఏం చేశావని ప్రశ్నిస్తే.. నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతారా? బ్రతికి ఉన్న నా తల్లిని అవమానపరుస్తారా? అని మండిపడ్డారు.
అమ్మను రాజకీయాల్లో తీసుకొచ్చారన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయావు. నా దయాదాక్షిణ్యాల మీద అర్బన్ బ్యాంక్ డైరక్టర్ అయ్యావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? అని బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో కరీంనగర్ ఎంపీగా చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే రావడం లేదని పొన్నం తెలిపారు. హిందువు అని చెప్పుకుంటూ.. నువ్వు వేములవాడ దేవస్థానానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. దండం పెట్టి అడుగుతున్న.. అందరిని కోరుతున్న బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజవర్గానికి ఏం చేశాడో నిలదీయాలని పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.