Voting : ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరికాదన్న ఎన్నికల సంఘం
ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి ఏ మాత్రమూ కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు కార్డు లేదా ఇతర ఏ నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని అయినా చూపించి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
Aadhaar Not Mandatory For Voting : రానున్నది ఎన్నికల కాలం. కాబట్టే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవసరమైన కీలక ప్రకటనను కేంద్ర ఎన్నికల సంఘం(CEC) చేసింది. ఎవరైనా సరే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆధార్ కార్డే ఉండాల్సిన పని లేదని స్పష్టం చేసింది. దానికి బదులుగా ఓటరు ఐడీ కార్డు గాని, మరే ఇతర గుర్తింపు ఐడీగాని ఉన్నా సరిపోతుందని వెల్లడించింది.
చెల్లుబాటు అయ్యే ఏ ఐడీని చూపించి అయినా సరే ప్రజలు తమ ఓటు హక్కును నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని హామీ ఇస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కొన్ని ఆరోపణలు చేశారు. బెంగాల్ ప్రజల ఆధార్ కార్డులను(Aadhar Cards) కేంద్ర ప్రభుత్వం డీ యాక్టివేట్ చేస్తోందని, తద్వారా వారిని ఓట్లు వేయనీయకుండా చేస్తోందని అన్నారు.
ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రే, డోలా సేన్, సాకేత్ గోఖలే, లోక్‌సభ ఎంపీలు ప్రతిమా మోండల్, సజ్దా అహ్మద్‌లతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. బెంగాల్ రాష్ట్రంలో ఆధార్ కార్డుల డీ యాక్టివేషన్‌పై వస్తున్న ఆరోపణనలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటు వేయడానికి తప్పకుండా ఆధార్ కార్డే ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ విషయంలో తాము హామీ ఇస్తున్నట్లు వెల్లడించింది.