»Ys Sharmila Allegations On Jagan At Congress Meeting
YS Sharmila : ఒక్క మాటా నిలబెట్టుకోనివాడు వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతాడు? : షర్మిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఏ ఒక్క హామీనీ నెవరవేర్చని జగనన్న అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు.
YS Sharmila Allegations on Jagan : ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దాన్నీ నిలబెట్టుకోని జగనన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతాడని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. చెల్లి అని కూడా చూడకుండా తనపై వ్యక్తిగత ధూషణలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ‘న్యాయ సాధన’ పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే, షర్మిలలు హాజరై ప్రసంగించారు.
ఈ సభలో వైఎస్ షర్మిల (YS Sharmila) మాట్లాడుతూ జగన్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని జగనన్న చెప్పారన్నారు. ఇప్పుడు ఏపీకి ఒక్క రాజధాని అయినా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాకే జగన్ ఓట్లు అడగాలని అన్నారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట మద్దతు ధర కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి హామీ ఏమైందని పంట నష్టపరిహారం కోసం రూ.4 వేల కోట్లతో నిధి హామీ ఏమైందని షర్మిల ప్రశ్నించారు.
జగన్(Jagan) పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టూ కూడా పూర్తి కాలేదని షర్మిల విమర్శించారు. మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు నాసిరకం మద్యాన్ని అమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు జగనన్న కోసం 3200 కి.మీ పాదయాత్ర చేసి ఆ పార్టీని నడిపించాను కానీ ఇప్పడు తన గురించి, తన భర్త గురించి ఇష్టా రీతిన దూషిస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారని షర్మిల ధ్వజమెత్తారు.