Dropped phone in water? : ఫోన్ నీళ్లల్లో పడిందా? ఇలా మాత్రం అస్సలు చేయకండి
మొబైల్ ఫోన్లు మనందరి రోజు వారీ జీవితంలో భాగం అయిపోయాయి. అందుకనే మనం ఏ పనుల్లో ఉన్నా ఇవి మనతోనూ ఉంటున్నాయి. ప్రమాదవశాత్తూ ఫోన్లు నీళ్లలో పడిపోయే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం పదండి.
Mobile In Water What To Do : మొబైల్ ఫోన్లు నీటిలో పడటం, లేదంటే దాని మీద నీటి చుక్కలు పడిపోవడం లాంటివి చాలా మందికి అనుభవంలోని విషయాలే. రోజంతా మొబైల్ ఫోన్ మనతో ఉంటుంది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. మరి ఇలా ఫోన్ నీటితో తడిచి పోయినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు ? అనే విషయాలపై అంతా అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ మధ్యకాలంలో చాలా మంది మొబైల్ ఫోన్(mobile phone) తడిచినప్పుడు బియ్యం మధ్యలో పెడితే అవి చెమ్మను లాక్కుంటాయని అనుకుంటున్నారు. అలానే చేస్తున్నారు కూడా. అయితే ఇది ఎంత మాత్రమూ సరైన పద్ధతి కాదని యాపిల్ కంపెనీ చెబుతోంది. బియ్యంలో తవుడు లాంటిది చిన్న చిన్న రేణువుల రూపంలో ఉంటుంది. అది చెమ్మకు ఫోన్లోని ఛార్జింగ్ పోర్ట్, ఇయర్‌ఫోన్స్ పోర్ట్ లాంటి భాగాల్లో చేరుకుని ఫోన్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాల్ని పెంచుతుంది. కాబట్టి ఇలా ఎంత మాత్రమూ చేయకూడదు. మార్కెట్లో సిలికా జెల్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. వాటిని ఒక పెద్ద కవర్లో వేసి ఫోన్‌ని ఆ ప్యాకెట్ల మధ్యలో పెట్టి కాసేపు ఉంచండి. అక్కడున్న తడినంతా ఇవి పీల్చేసుకుంటాయి.
ఫోన్ (phone) తడిచిపోయింది అనుకున్నప్పుడు దాన్ని వెంటనే ఆన్ చేసే ప్రయత్నం గాని, ఛార్జింగ్ చేసే ప్రయత్నం గాని చేయకూడదు. ఒక వేళ ఫోన్‌ని ఛార్జింగ్ చేస్తున్న సమయంలో నీటిలో పడితే.. వెంటనే దాన్ని ప్లగ్ నుంచి తీసేయండి. దాన్ని వెంటనే పొడి బట్టతో శుభ్రంగా తుడవండి. దాన్ని ఆరబెట్టేందుకు వేడి గాలి వచ్చే హెయిర్ డ్రైయ్యర్లలాంటి వాటిని ఎంత మాత్రమూ ఉపయోగించకండి. పూర్తిగా ఆరిన తర్వాత వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి ఇవ్వండి.