»Uttar Pradesh Murder Case Read Law And Plead His Own Case Innocent
Uttarpradesh: చేయని తప్పుకు శిక్ష..లా చదివి తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా!
కొందరు ఎలాంటి తప్పు చేయకుండా కొన్ని కేసుల్లో ఇరుక్కుంటారు. దీంతో జీవితం అయిపోయిందని డిప్రెషన్లోకి వెళ్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి మాత్రం దీనికి భిన్నం.
Uttarpradesh: తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడుతుందో లేదో తెలియదు కానీ.. కొంతమంది ఎలాంటి తప్పు చేయకపోయిన ఒక్కోసారి కొన్ని కేసుల్లో నిందితులుగా ఇరుక్కుంటారు. ఇలా జరిగితే వాళ్ల జీవితం ఒక్కసారిగా ఆగిపోతుంది. మానసికంగా ఇబ్బంది పడుతూ.. డిప్రెషన్లోకి వెళ్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమిత్ చౌధరీ అనే వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి లా చదివి తన కేసు తానే వాదించుకుని నిర్దోషిగా మారాడు.
మేరఠ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల హత్య కేసులో అమిత్ చౌధరీని 12 ఏళ్లు క్రితం అరెస్ట్ చేశారు. అతనిపై గ్యాంగ్‌స్టర్ అని ముద్ర కూడా వేశారు. దీంతో ఆయన జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. హత్యకు గురైంది పోలీసులు కావడంతో అప్పటి యూపీ ముఖ్యమంత్రి మాయావతి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. హత్యలు జరిగిన సమయంలో అమిత్ మేరఠ్‌లో లేరు. కానీ అతనిని అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో అమిత్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. జైలులో కూడా చాలా మందది తనకు గ్యాంగ్‌లో చేరమని ప్రోత్సహించారు. కానీ వాటిన్నింటిని అమిత్ తిరస్కరించాడు.
ఓ రైతు కొడుకైన అమిత్ ఈ కేసులో నిర్దోషిగా బయటపడాలని నిర్ణయించుకున్నాడు. బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి బీ.ఎ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. తర్వాత బార్ కౌన్సిల్ పరీక్షలో పాసయ్యి.. తన కేసును తానే వాదించుకుని నిర్దోషిగా బయటపడ్డాడు. తనతో పాటు మరో 13 మందిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. భారత సైన్యంలో సేవలు అందించాలనుకున్న తన కలలు జైలుకి వెళ్లగానే చెదిరిపోయాయని బాధపడ్డాడు. కానీ దేశానికి సేవ చేసే అవకాశం న్యాయవాది రూపంలో లభించిందని అన్నాడు.