బ్యాక్టీరియాకు నోబెల్ విజేత, 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా 'ప్లాంటోయా ఠాగూరై' అని నామకరణం చేసినట్లు విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం తెలిపింది.
కోల్ కతాలోని విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం కొత్త రకం బ్యాక్టీరియాను కనుగొంది. ఈ బ్యాక్టీరియాలో మొక్కలు వేగంగా ఎదిగేందుకు ఉపయోగపడే పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. ఇది వృక్ష జాతులకు ఎంతో మేలు చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మంచి బ్యాక్టీరియాకు నోబెల్ విజేత, ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా ‘ప్లాంటోయా ఠాగూరై’ అని నామకరణం చేశారు.
ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మైక్రోబయాలజీ ప్రొఫెసర్ బొంబా దామ్ మాట్లాడుతూ.. రవీంద్రనాథ్ ఠాగూర్ వ్యవసాయాన్ని ఎంతగానో ఇష్టపడేవారని, వ్యవసాయం గొప్పగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారని వెల్లడించారు. అందుకే ఈ మేలు చేసే బ్యాక్టీరియాకు రవీంద్రుడి పేరు (Plantoea Tagorei) పెట్టామని వివరించారు. జీవులకు ఆయన పేరు పెట్టడం ఇదే ప్రథమం అని తెలిపారు.