థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన హాస్య నటుడు పృథ్వీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం ఆస్తులమ్మేశానని తెలిపారు. దాదాపు కోటి రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని పేర్కొన్నారు. అయితే చివరికీ తాను ఆస్పత్రిలో ఉంటే ఒక్క బెడ్ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా తన రాజకీయ జీవితంపై ఆసక్తికర అంశాలు మాట్లాడాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఉత్సాహంగా పని చేసినట్లు పృథ్వీ తెలిపాడు. పార్టీ కార్యక్రమాల కోసం తాను సొంతంగా ఖర్చు చేసినట్లు చెప్పాడు. వాటికోసం ఆస్తులను అమ్మేశానని వాపోయాడు. సినిమాల్లో వచ్చిన డబ్బుతో కొన్న ఆస్తులను రాజకీయాల కోసం అమ్మేశానని, షాద్ నగర్ లోని తన రెండు ఆస్తులు అమ్మేసినట్లు వివరించాడు. ఆ పార్టీ కార్యక్రమాల కోసం దాదాపు రూ.90 లక్షలు ఖర్చు చేసినట్లు పృథ్వీ తెలిపాడు. రాజకీయాల్లోకి వెళ్లి సంపాదించుకున్నది ఏమీ లేదని తెలిపాడు.
అయితే రాజకీయాల్లోకి వెళ్లి సంపాదించుకున్నది ఏమీ లేదు కానీ ఉన్నది పోగొట్టుకున్నట్లు పృథ్వీ ఆవేదన చెందారు. రోజుకి లక్షన్నర నుంచి రెండు లక్షలు సంపాదించే సమయంలో తాను అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్లినట్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానో తెలియదు కానీ వెళ్లి తప్పు చేశానని తెలిపాడు. పార్టీ కోసం అంత కష్టపడితే తనకు కరోనా సమయంలో కనీసం ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఆస్పత్రిలో ఒక బెడ్ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను పడిన కష్టాలు, అనుభవాలు, అవమానాలు ఆ ఇంటర్వ్యూలో పృథ్వీ వివరించాడు.