శ్రీహరి కోట ప్రత్యేకత గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇండియాలో శ్రీహరి కోట రాకెట్ ప్రయోగాలకు నిలయమైంది. అధునాతన సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రాంతం రాకెట్ ప్రయోగాలకు అనువైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. రేపు శ్రీహరికోట నుంచి చంద్రయాన్3 ని ప్రయోగించనున్నారు.
ఇండియా(India)లో రాకెట్ల ప్రయోగాలన్నీ(Rocket Launches) కూడా శ్రీహరి కోట(Sriharikota) నుంచే చేపడుతారు. అందుకు చాలా కారణాలున్నాయి. ఏపీలోని కోరమాండల్ తీరంలోని నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు ఉంది. ఆ సరస్సుకు బంగాళాఖాతానికి మధ్య 175 చదరపు కిలోమీటర్ల మేర శ్రీహరికోట విస్తరించి ఉంది. అందులోనే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) ఉంది. ఇండియాకు సంబంధించిన ఉపగ్రహాలన్నీ కూడా శ్రీహరి కోట నుంచే ప్రయోగిస్తుంటారు.
చంద్రయాన్1, 104 ఉపగ్రహాలన్నింటినీ ఒకేసారి షార్ నింగిలోకి పంపి రికార్డు నెలకొల్పింది. అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు షార్ అహర్నిశలు కష్టపడుతోంది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ఇండియాలో చాలా ప్రాంతాలు ఉన్నా తిరువనంతపురంలో ఉపగ్రహ తయారీ కేంద్రం ఉంది. భారత దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ రాకెట్ ప్రయోగాలకు మాత్రం శ్రీహరికోటనే ఎంచుకున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి.
రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోట(Sriharikota)ను ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం. అక్కడి నుంచి రాకెట్‌ను ప్రయోగించినట్లైతే పైసా ఖర్చు లేకుండా సెకన్‌కు 0.4 కిలోమీటర్ల వేగంతో రాకెట్ వేగాన్ని పుంజుకుంటుంది. భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. ప్రపంచంలోని రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ కూడా భూమధ్య రేఖకు సమీపంగానే శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు.
శ్రీహరికోట(Sriharikota)కు సుమారుగా 50 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండటంతో అక్కడ రాకెట్ ప్రయోగం సక్సెస్ కాకుంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగదు. శ్రీహరికోట ప్రాంతం చుట్టూ నీరు ఉండటం వల్ల జనావాసాల మీద రాకెట్ శకలాలు పడే అవకాశం లేదు. శ్రీహరి కోటకు రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయాలున్నాయి. అలాగే శ్రీహరి కోట ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండదు. శ్రీహరికోటలో ఏడాది పొడవునా వాతావరణం సాధారణంగానే ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి. మిగిలిన 10 నెలలు ప్రయోగాలకు ఆ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే..శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంది. అందుకే భారత్‌కు ఉన్న అరుదైన భూభాగంగా శ్రీహరికోట..ఇప్పుడు రాకెట్ ప్రయోగాల కోటగా మారిపోయింది.