అతను పండు ముసలివాడు. కాటికి కాళ్లు చూపుకొని కూర్చొని ఉన్నాడు. మరి ఈ అమ్మాయి నిండా 18ఏళ్లు కూడా లేవు. వీరిద్దరూ ఇటీవల బంధువుల సమక్షంలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వినగానే.. బలవంతంగా ఆ చిన్న పిల్లను ముసలివాడికి ఇచ్చి కట్టపెట్టారా..? ఈ రోజుల్లోనూ ఇలాంటి పెళ్లిళ్లు చేస్తున్నారా అని ఆగ్రహం వచ్చేస్తోందా..? కంగారు పడకండి. ఇది బలవంతంగా చేసిన పెళ్లి కాదు. ప్రేమ వివాహం. నమ్మసక్యం కాకపోయినా ఇదే నిజం. 78ఏళ్ల ముసలివాడిని 18ఏళ్ల యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. మూడేళ్ల పాటు ప్రేమించి మరీ వారు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం గమనార్హం. దానికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే.. బతిమాలి ఒప్పించి మరీ ఆ అమ్మాయే పట్టుపట్టి పెళ్లి చేసుకుందట. ఈ సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిలిప్పిన్స్‌లోని కగయాన్ ప్రావిన్స్‌కు చెందిన 78 ఏళ్ల రషద్ మంగాకాప్ బ్రహ్మచారి. ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొంది ఒంటరిగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ డిన్నర్ పార్టీలో అతడికి హలీమా అబ్ధుల్లా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మొగ్గ తొడిగింది.
అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరూ మూడేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తర్వాత హలీమా తన తల్లిదండ్రులతో పెళ్లి గురించి మాట్లాడింది. మొదట వాళ్లు ఒప్పుకోలేదు. కానీ.. అతనిని తప్పితే మరెవరినీ పెళ్లి చేసుకోనని ఆమె మొండి పట్టుదల పట్టడంతో వారు ఒప్పుకోక తప్పలేదు.
దీంతో.. ఇటీవల వీరికి ఘనంగా పెళ్లి జరిపించారు. వీరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. నెటిజన్లు మాత్రం ఈ పెళ్లిపై ఎక్కువగా విమర్శలు చేస్తుండటం గమనార్హం.